UP Road Accident: యూపీలో ఘోర రోడ్డుప్రమాదం - చెరువులో ట్రాక్టర్ బోల్తా, 26 మంది మృతి
భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్అదుపుతప్పి చెరువులో బోల్తా పడిన ప్రమాదంలో మొత్తం 26 మంది వరకు మృతి చెందారు. యూపీలోని కాన్పుర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది వరకు మృతి చెందారు. మరో 10 మందికి గాయపడ్డారు, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాన్పుర్‌లోని ఘతంపుర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
పూజ ముగించుకుని తిరిగొస్తుండగా విషాదం..
కాన్పుర్‌లోని ఘతంపుర్ ప్రాంతానికి చెందిన భక్తులు సమీపంలోని ఓ గుడికి శనివారం సాయంత్రం వెళ్లారు. పూజలు ముగించుకుని రాత్రి సమయంలో గుడి నుంచి ట్రాక్టర్ లో తిరిగి వస్తుండగా.. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. తొలుత ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో దాదాపు 50 మంది వరకు ప్రయాణిస్తున్నారని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు.
Uttar Pradesh | Over two dozen people injured after a tractor trolley carrying pilgrims returning from Unnao met with an accident as it overturned in Ghatampur area in Kanpur district. Police on the spot pic.twitter.com/AKCY9rxRWH
— ANI (@ANI) October 1, 2022
భారీగా పెరిగిన మృతుల సంఖ్య..
రాత్రివేళ కావడం, అందులోనూ ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు. మొదట 6 మంది చనిపోయినట్లు గుర్తించగా, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య 26కు పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమీపంలోని చంద్రికాదేవి ఆలయంలో నిర్వహించిన మండన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ట్రాక్టర్ లో తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద స్థంలోనే 12కు పైగా భక్తులు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు తుదిశ్వాస విడిచారని అయ్యార్ వివరించారు.
ప్రమాదంలో గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స కోసం మొదట భీటర్‌గావ్ కు అంబులెన్స్‌లలో తరలించారు. అందులో కొందరు చనిపోయారని వైద్యలు నిర్ధారించగా, మిగతావారిని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం లాలా లజపత్ రాయ్ హాస్పిటల్ కు తరలించినట్లు జీఎస్‌వీఎం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ కాలా తెలిపారు.
ప్రధాని మోదీ, యూపీ సీఎం సంతాపం..
కాన్పూర్ లో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని, వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.