Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - గొంతులో చికెన్ ఇరుక్కుని చిన్నారి మృతి, మరోచోట కిటికీలోంచి పడి చిన్నారి దుర్మరణం
Tragedy Incidents: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. విజయవాడలో కిటికీలోంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.
Child Died Due To Chicken In Annamayya District: చికెన్ ముక్క రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేట మండలం మన్నూరులో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకూ సరదాగా ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేట మండలం మన్నూరుకు కొంతకాలం క్రితం వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆదివారం కావడంతో ఇంట్లో చికెన్ వండగా భోజనాల అనంతరం పనులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కింద పడ్డ చికెన్ తిని..
దంపతుల చిన్న కుమారుడు సుశాంక్ కిందపడిన చికెన్ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఏమైందో తెలియక అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చేతుల్లోకి తీసుకుని 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కిటికీలోంచి కింద పడి
అటు, విజయవాడలో (Vijayawada) మరో చిన్నారి హోటల్ కిటికీలోంచి పడి ప్రాణాలు కోల్పోయింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం హోటల్‌లో బస చేయగా.. అప్పటివరకూ ఆడుకుంటోన్న చిన్నారి విగతజీవిగా మారడం చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన నాగరాజు కుటుంబం పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తోంది. నాగరాజుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు విశాఖ నుంచి బయల్దేరి శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో విజయవాడకు వచ్చారు. ఆదివారం రాత్రి ఓ హోటల్‌లో దిగారు. సోమవారం ఉదయం కననదుర్గమ్మను దర్శించుకోవాలని అనుకున్నారు. సోమవారం ఉదయం తన అన్నతో కలిసి నాలుగేళ్ల చిన్నారి రుహిక ఆడుకుంటూ కిటికీ తలుపు తీసింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నాల్గో అంతస్తు నుంచి జారి పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: TDP Office Attck: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్ పొడిగించిన కోర్టు