Tirupati News: తిరుపతిలో విరూపాక్ష సీన్- అర్థరాత్రి పూట అగ్గిరాజేస్తున్న యువతి
Tirupati News: తిరుపతి జిల్లా కొత్త శానంబట్లలో జరిగిన వరుస అగ్నిప్రమాద ఘటనల కేసును పోలీసులు lఛేదించారు. తల్లి ప్రవర్తన మార్చాలనే ఉద్దేశంతో 19 ఏళ్ల అమ్మాయి ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తేల్చారు.
Tirupati News: తిరుపతి జిల్లాలోని కొత్త శానంబట్లలో ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం, ఇళ్లలో బట్టలు తగలబడిపోవడం, ఒకానొక సమయంలో తాళం వేసిన ఇంట్లలోని బీరువాలకు మంటలు అంటుకోవడం సంచలనంగా మరింది. విరూపాక్ష సినిమా రిలీజ్ కావడం అలాంటి సీన్లే ఇక్కడ కనిపించడంతో అంతా కంగారు పడ్డారు. ఊరికేదో అరిష్టం జరిగిందని భయపడిపోయారు.
వరుసగా జరుగుతున్న ఘటనలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు కొత్త శానంబట్లలో ఏం జరుగుతుందోనని స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం చేసిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఏఎస్పీ వెంకట రావు తెలిపారు.
ఈ ఘటనలకు కొత్త శానంబట్ల గ్రామానికి చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయే కారణమని షాక్ ఇచ్చారు. పిల్లపాలెం కీర్తిగా గుర్తించినట్లు వెల్లడించారు. తల్లి ప్రవర్తన నచ్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పారు. తల్లి ప్రవర్తనను మార్చేందుకు ఇలాంటి పనులు చేసిందని.. వారి బంధువుల ఇళ్లలో అగ్గి పుల్లలు గీసి పడేస్తూ.. ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు.
ముందుగా గడ్డివాము కాల్చి వేసిందని.. ఈ అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగింలేదని తెలిపారు. ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తిని వినియోగించలేదని స్పష్టం చేశారు. మూఢనమ్మకాలను నమ్మకండని ప్రజలకు సూచించారు. తన ఇంట్లోనే యువతి మూడు సార్లు నిప్పు పెట్టిందని చెప్పారు.
ఈలోపు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి కొందరు ఆర్థిక సాయం చేస్తూ రాగా... దీంతో అత్యాశకు పోయిన గ్రామంలోని ఇద్దరు కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో ఇదంతా గుర్తించిన పోలీసులు కీర్తితోపాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కీర్తి వద్ద నుంచి ముప్పై రెండు వేల రూపాయలు రికవరీ చేశామని ఎస్పీ వెంకట రావు తెలిపారు. అలాగే కీర్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.