Tirupati News : మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి, మద్యం మత్తులో దారుణం!
Tirupati News : మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని చిన్నారిని నేలకేసి కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆ చిన్నారి ప్రాణం వదిలాడు.
Tirupati News : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో మూడు నెలల పసికందుని నేలకేసి కొట్టి చంపాడో ఓ కసాయి తండ్రి. నేలపై పడిన పసికందు తలకి బలమైన గాయం కావడంతో క్షణాల్లో ప్రాణాలు వదిలాడు చిన్నారి. భార్యపై కోపాన్ని లోకం తెలియని పసికందుపై చూపించాడు తండ్రి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.
అసలేం జరిగింది?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామానికి చెందిన మునిరాజా(22), స్వాతి(19) దంపతులకు మూడు నెలల పసికందు ఉంది. కుటుంబ కలహాలతో మునిరాజ వేడం గ్రామాన్ని వదిలి ఇరవై రోజుల క్రితం శ్రీకాళహస్తిలోని వాటర్ కాలనీలో వేరే కాపురం పెట్టాడు. దీంతో అంతా సర్ధుకుంటుందని భావించారు. స్థానికంగా తెలిసిన వారి దగ్గర మునిరాజా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వేరుకాపురం విషయంలో మునిరాజా తల్లిదండ్రులకు, స్వాతికి తరచూ గొడవలు జరిగేవి. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో మునిరాజా మద్యానికి బానిసగా మారాడు. మూడు నెలల పసికందు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వెద్యం అందించారు. మనవడుని చూసేందుకు శ్రీకాళహస్తికి వచ్చిన మునిరాజా తల్లిదండ్రులు చీకటి పడడంతో ద్విచక్ర వాహనాన్ని మునిరాజా నివాసం వద్దే ఉంచి వెళ్లిపోయారు.
మద్యం మత్తులో దారుణం
మద్యం తాగి ఇంటికి వచ్చిన మునిరాజాకు, స్వాతి శుక్రవారం మళ్లీ గొడవ జరిగింది. పసికందుకు అనారోగ్యం ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి తీసుకుని వెళ్లకుండా తాగివస్తావా అంటూ స్వాతి మునిరాజాని ప్రశ్నించింది. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరుకోవడంతో ఇరుగు పొరుగు వారు భార్య భర్తల మధ్య కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చేశారు. తరువాత పసికందుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుంటూ ఉండగా, ఆ స్కూటర్ పై ఆసుపత్రికి రారని స్వాతి తేల్చి చెప్పింది. దీంతో మరోకసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మునిరాజా ఈ గొడవకంతా కారణం పసికందే అని ఆ పసికందును ఒక్కసారిగా పైకి ఎత్తి నేలకేసి కొట్టాడు. దీంతో పసికందు తలకి బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే పసికందు మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు మునిరాజాను అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు
"మునిరాజా, స్వాతి వాటర్ కాలనీ ఉంటున్నారు. వీళ్లు కూలిపని చేసుకుని జీవిస్తున్నారు. మూడు నెలల బాబుకు పీవర్స్ వచ్చింది. ఆసుపత్రి తీసుకెళ్లే విషయం ఇద్దరికి గొడవ జరిగింది. జ్వరంతో చిన్నారి రాత్రి 11 వరకూ ఏడుస్తూ ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్తానంటే భార్య బండి ఎక్కలేదని, వారి మధ్య గొడవ ఈ కారణాలతో చిన్నారిని నేలకేసి కొట్టాడు తండ్రి. బాబు తలకి బలమైన గాయం అయింది. చిన్నారి చనిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేశాం. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపిస్తాం. చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటాం" - సీఐ అంజు యాదవ్