Tiger Wandering: విజయనగరం జిల్లాలో మళ్లీ పులి కలకలం, భయాందోళనలో ప్రజలు!
Tiger Wandering: విజయనగరం జిల్లాలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. నాలుగు నెలల నుంచి పులి జిల్లా వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Tiger Wandering: విజయనగరం జిల్లాలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. గత నాలుగు నెలల నుంచి జిల్లావాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. గత 20 రోజులుగా ఎక్కడా ఎలాంటి అలజడి చేయకపోవడంతో పక్క రాష్ట్రానికి వెళ్లి పోయి ఉండొచ్చని అంతా భావించారు. కానీ జిల్లావాసుల అంచనాలు తారుమారయ్యాయి. తాజాగా మెంటాడ మండలం అమరాయివలసలో అవుదూడ పై దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అమరాయివలస సమీపంలో గల పొదల్లోకి దూడను లాక్కొని వెళ్లిన పులి ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. దీంతో అమరాయివలస గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారం సమాచారంతో స్థానిక అటవీశాఖ అధికారులు యథావిధిగా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. అసలు పులి కథ అర్దం కాక ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్నారు.
నెలరోజుల క్రితం ఆవుపై దాడి..
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం వేమలి గ్రామ పొలిమేరల్లో పశువుల శాలలో కట్టి ఉన్న ఆవు పై పులి దాడి చేసింది. సమీపంలోని మామిడి తోటలోకి ఆవును లాక్కొని వెళ్లి ఆవు పై దాడి చేసినట్లు రైతులు గుర్తించారు. ఆవును వెతికే క్రమంలో మామిడి తోటలో చనిపోయి పడి ఉన్న ఆవును యజమాని గుర్తించాడు. దీంతో పరిసర ప్రాంతాలైన వేమలి, రంగుపురం, ముచ్చర్ల, కొత్తవలస గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామంలో ఎవరు ఒంటరిగా తిరగొద్దంటూ సమీప గ్రామాల్లో దండోరా వేయించారు.
మొన్నటి వరకు బెంగాల్ టైగర్ కలకలం..
విజయనగరం జిల్లాలో గత కొంతకాలంగా కొండ ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో విజయనగరం అటవీ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. ఇటీవలే తెర్లాం మండలం, గొరుగువలస గ్రామంలో ఆవుదూడపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పులి రోజుకో ప్రాంతంలో మూగజీవాలపై దాడి చేస్తుంది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం లేదు. ప్రస్తుతం వంగర మండలంలో రాయల్ బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు పాలకొండ డివిజన్ అటవీశాఖ అధికారులు. వంగర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ గ్రామాల్లో దండోరా వేయించింది. పంట పొలాల్లోకి పనుల కోసం వెళ్లే రైతాంగానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బెంగాల్ టైగర్ వీడియోలను చూసి పులి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. పులి కోసం అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఏనుగులు, ఎలుగుబంట్లు ఇప్పుడు పులి..
మొన్నటి వరకు ఏనుగులు, ఎలుగుబంట్లు ఇప్పుడు పులి భయంతో ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటనే భయపడుతున్నారు. ఇటీవల ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. మరోపక్క ఏనుగులు ఏ రాత్రి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పులి అడుగులు కనిపించడంతో గ్రామంలో ప్రజలందరూ వణికిపోతున్నారు. అడవుల్లో ఉండాల్సిన జంతువులన్నీ ఊర్ల మీదకు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఎలాగైనా వీటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు.