Who Killed Viveka : వైఎస్ వివేకా హత్య జరిగి మూడేళ్లు ! హంతకులెవరో ఎప్పటికి తేలుతుంది ?
వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి మూడేళ్లయింది. హంతకులెవరో సీబీఐ త్వరలోనే చెప్పే అవకాశం కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ మంత్రి, ఎంపీ , ఎమ్మెల్యే వంటి కీలక పదవుల్లో సుదీర్గ కాలం పని చేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లు. హైప్రోఫైల్ కేసు కావడంతో సహజంగానే సంచలనాత్మకం అయింది. అయితే మూడేళ్లలో ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్నో వివాదాల మధ్య విచారణ నడుస్తోంది. ఈ కేసు కొలిక్కి వస్తే ఏపీ రాజకీయాలు మారిపోతాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడీ కేస్ హాట్ టాపిక్ అవుతోంది.
2019, మార్చి 15న హత్య !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లు. 2019, మార్చి 15 రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణం ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. అభ్యర్థుల్ని ప్రకటించడానికి సీఎం జగన్ ముహుర్తం ఖరారు చేసుకున్నారు. కానీ బాబాయి వైఎస్ వివేకా హత్య జరగడంతో వాయిదా వేసుకుని.. పులివెందుల వెళ్లారు. అది ఎన్నికల సమయం కావడంతో సహంజగానే ఆ అంశం చుట్టూ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అటు టీడీపీ.. ఇటు వైఎస్ఆర్‌సీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చంద్రబాబే హత్య చేయించాడని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.వారికి సంబంధించిన పత్రికలోపెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. టీడీపీ నేతలు ఈ హత్య ఎవరు చేయారో తేల్చాలని డి్మాండ్ చేశారు. అయితే తమపై ఆరోపణలు చేయకుండా సీఎం జగన్ హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కోసం పిటిషన్ వేశారు.
ఎన్నికల తర్వాత మరింత నెమ్మదించిన విచారణ !
ఎన్నికలకు ముందు కోడ్ అమల్లో ఉన్న సమయంలో హత్య జరిగింది. హైకోర్టులో పిటిషన్లు పడటం ..సిట్ బృందం సభ్యుల్ని మార్చడం.. ఎన్నికల సంఘం కడప ఎస్పీని కూడా బదిలీ చేయడంతో విచారణ నెమ్మదించింది. ఎన్నికలకు.. ఫలితాలకు రెండు నెలలు గ్యాప్ ఉంది.ఆ సమయంలో పోలీసులు ఏమీ దర్యాప్తు చేయలేకపోయారు. ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విజయం సాధించింది. ఆ తర్వాత సిట్ బృందాన్ని మార్చడం.. కడప ఎస్పీని బదిలీ చేయడంతో విచారణ పూర్తిగా మందగించింది. చివరికి తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ సాధించుకున్నారు. సీఎం కాక ముందు సీబీఐ విచారణ అడిగిన జగన్.. సీఎం అయిన తర్వాత వద్దన్నారు. అయినా హైకోర్టు సీబీఐకి కేసు విచారణను అప్పగించింది.
మొదటి నుంచి మిస్టరీనే !
మొదటి నుంచి వివేకా కేసు మిస్టరీనే. మొదట గుండెటపోటు అని నమ్మంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. గుండెపోటుతో మరణించారని మీడియాకు సమాచారం ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటంచారు. అయితే ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని వెల్లడయింది. డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ ఎవరూ ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచి పెట్టి సాక్ష్యాలను తారుమారు చేసి స్మూత్‌గా అంత్యక్రియలు జరిపించేయాలని. ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికైనా కేసు కొలిక్కి వస్తుందా ?
సీబీఐ విచారణ ఇప్పుడు చివరి దశకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తుది చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు రాజకీయంగానూ సున్నితంగా మారింది. అందుకే.. ఎప్పుడు మిస్టరీ తొలగిపోతుందో అని ఎదురుచూస్తున్నారు. ఎవరు వివేకానందరెడ్డిని చంపారు ? ఎవరు చంపించారు ? ఎందు కోసం ? అన్న మిస్టరీ తేలితే కేసు తేలిపోయినట్లే భావించవచ్చు.