Crime News: రూ.6 కోట్ల విలువైన బంగారం చోరీ - హైదరాబాద్ టు విజయవాడ, పక్కా ప్లాన్‌తో కారు డ్రైవర్ జంప్
Gold Thefting: ఓ కారు డ్రైవర్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తూ జ్యువెలరీ దుకాణానికి చెందిన రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Car Driver Escaped With 6 Crore Rupees Gold Ornaments: ఓ కారు డ్రైవర్ పక్కా ప్లాన్‌తో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు నగలను ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో పరారయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (Jaggayyapeta) మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన శ్యాంబాబా జ్యువెలరీ దుకాణం నుంచి బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో జ్యువెలరీ వ్యాపారి సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో ఉంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన కారు డ్రైవర్ జితేంద్రకు, తన సొంత మనుషులు ఇద్దరికి ఇచ్చి పంపించేలా ఏర్పాట్లు చేశారు.
అయితే, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలోకి రాగానే వీరు టీ తాగేందుకు ఆగారు. ఇదే సమయంలో మిగిలిన ఇద్దరికీ తెలియకుండా డ్రైవర్ కారుతో సహా పరారయ్యాడు. నందిగామ మండలం మునగచర్ల అడ్డరోడ్డులోని ఓ కోల్డ్ స్టోరేజీ వద్ద కారును వదిలిపెట్టి మొత్తం బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. సెల్ ఫోన్ సైతం స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంగారు వ్యాపారి హైదరాబాద్‌లోని డ్రైవర్ ఇంటి వద్దకు వెళ్లి చూడగా.. ఇల్లు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌తో పాటు కారులో వెళ్లిన ఇద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో బంగారం స్వాధీనం
అటు, ఏపీలో కస్టమ్స్ అధికారులు ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, తాడిపత్రి రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వే స్టేషన్, బొల్లపల్లి టోల్ ప్లాజా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న 17.9 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. మొత్తం 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి విశాఖ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న బంగారం విలువ రూ.14.37 కోట్లు ఉంటుందని చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.
అమలాపురంలో భారీ చోరీ
మరోవైపు, అమలాపురంలో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నిద్రిస్తుండగా దుండగులు దాదాపు రూ.20 లక్షల విలువైన 35 కాసుల బంగారం, రూ.లక్షన్నర నగదు దోచుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండగకు ఊర్లు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని.. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడదని పోలీసుల సూచిస్తున్నారు.
Also Read: Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి





















