Telangana Woman: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య - చెత్తబుట్టలో మృతదేహం లభ్యం
Hyderabad News: ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. చెత్తబుట్టలో మృతదేహం లభ్యం కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Woman Killed in Australia: ఆస్ట్రేలియాలోని (Australia) విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్‌శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య (శ్వేత).. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా (Victoria) రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే చైతన్య భర్త అశోక్ రాజ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. వారి ఇంటికి 86 కి.మీ దూరంలోని చెత్తబుట్టలో శనివారం ఆమె మృతదేహం లభ్యమైంది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. భర్తే ఆమెను హతమార్చినట్లు గుర్తించారు. భార్యను చంపిన అనంతరం కుమారుడిని తీసుకుని అశోక్ రాజ్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు భర్తే నిందితుడని తేల్చారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
మరోవైపు, ఏపీకి చెందిన ఓ వైద్యురాలు ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన యువ వైద్యురాలు వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వ విద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఈ నెల 2న స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఉజ్వల తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇంతలోనే ఇలా మృత్యువు కబళించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలోని స్వగ్రామానికి వైద్యురాలు ఉజ్వల మృతదేహం శనివారం చేరుకుంది. ఈ క్రమంలో ఆమె పార్థివ దేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: Hanmakonda News: ఘోర ప్రమాదం - కాపరి సహా 80 గొర్రెలను ఢీకొన్న రైలు, ఎక్కడంటే?