Zaheerabad News : బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు షాక్!
Zaheerabad News : బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు ఓ ప్రభుత్వ వైద్యుడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె బతికే ఉందని నిర్థారించారు.
Zaheerabad News : వైద్యుడు దైవంతో సమానం అని భావిస్తారు. దైవం ప్రాణం పోస్తే వైద్యులు ప్రాణం నిలబెడతారని నమ్ముతారు. అలాంటి వారిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు తరచూ వార్తల్లో నిలుసున్నారు. తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ చనిపోయిందని నిర్థారించారు వైద్యుడు. ఆపై ఆమెకు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. అయితే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమె బతికే ఉందని తేల్చారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలే జరిగింది?
ఓ ప్రభుత్వ డాక్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మున్నూరి అర్చనకు మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన బాలకృష్ణారెడ్డితో ఇటీవల వివాహం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అర్చన తన పుట్టింటిలోనే ఉంటోంది. మే 7న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తండ్రి నరసింహులు జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని డ్యూటీ డాక్టర్ సంతోష్ ఆమెను పరీక్షించారు. అర్చనకు ECG పరీక్ష నిర్వహించి, నివేదికను పరిశీలించిన తర్వాత ఆమె చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు. అదే విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయగా డాక్టర్ సంతోష్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు.
బతికే ఉన్నట్లు తేల్చిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు
అయితే అర్చన తండ్రి నరసింహులు ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించగా ఆమె బతికే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. అయితే మరో 24 గంటల వరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై వారు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చికిత్స ప్రారంభించిన తర్వాత మరుసటి రోజే అర్చనకు స్పృహ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత మే 28న ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. అర్చనకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వైద్యుడిపై నరసింహులు ఆగ్రహం చేశారు. అర్చన భర్త బాలకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, పోలీసులకు డాక్టర్ సంతోష్‌పై ఫిర్యాదు చేశారు.
Also Read : Hyderabad Minor girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు, సంచలన ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్
Also Read : Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు, మరో ముగ్గురు నిందితులు అరెస్ట్!