Viral News : ఇయిర్ ఫోన్లు పెట్టుకుని పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు.. యువతి మృతి
Viral News : సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ మొబైల్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.

Viral News :సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ మొబైల్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల అతి వినియోగం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతోంది. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పల్ఘర్ జిల్లాలోని మకానే గ్రామానికి చెందిన 16 ఏళ్ల వైష్ణవి రావల్ తన ఇయర్‌ఫోన్లు ధరించి రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని దుర్మరణం పాలైంది. ఈ ఘటన సఫాలే రైల్వే స్టేషన్‌లో జరిగింది.
రైలు హారన్ వినిపించలేదు..
సాధారణంగా రైల్వే ట్రాక్ దాటడం ఎంతో ప్రమాదకరం. అందుకే రైల్వే శాఖ పదేపదే ఫుట్‌ఓవరబ్రిడ్జిలను ఉపయోగించాలని ప్రజలకు సూచిస్తూ అవగాహన కల్పిస్తోంది. అయితే, కొందరు ప్రయాణికులు ఈ హెచ్చరికలను విస్మరిస్తూ రైలు పట్టాలు దాటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనల్లో తాజాగా వైష్ణవి రావల్ పేరు చేరిపోయింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఆమెకు ట్రైన్ హారన్ వినిపించలేదు. హారన్ విన్నట్లయితే ఆమె తప్పుకునేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇయర్‌ఫోన్లు ధరించి ఉండడంతో ఆమెకి రైలు సమీపిస్తున్న విషయమే తెలియలేదు.
వైష్ణవి పట్టాలు దాటుతుండగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సిబ్బంది హారన్ మోగిస్తూ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీకొట్టి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read : Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
దిగ్భ్రాంతికి గురైన ప్రయాణికులు
ఈ ఘటనతో రైలు ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రైలు ప్లాట్‌ఫాంపై గుమికూడి విషాదాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఘటన గురించి తెలియగానే తల్లడిల్లిపోయారు.
తప్పకుండా పాటించాల్సిన రైల్వే నియమాలు
రైల్వే శాఖ తరచుగా ప్రయాణికులకు కొన్ని హెచ్చరికలను జారీ చేస్తోంది. వాటిలో ముఖ్యమైనవి:
* పట్టాలపై నడవకూడదు – రైలు పట్టాలపై నడవడం అత్యంత ప్రమాదకరం. తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదా అండర్‌పాస్ ద్వారా వెళ్లాలి.
* ఇయర్‌ఫోన్లు, మొబైల్ లను జాగ్రత్తగా వినియోగించాలి. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ఇయర్‌ఫోన్లు తొలగించుకోవడం, మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.
* రైలు హారన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. హారన్ వినిపించిన వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలి.
Also Read : Son killed mother: తల్లిని కత్తితో పొడిచి చంపిన కుమారుడు - హైదరాబాద్‌లో ఘోరం - డబ్బుల కోసమే ?
పాఠంగా మారిన ఘటన
వైష్ణవి రావల్ మరణం సెల్‌ఫోన్ వ్యసనంతోపాటు నిర్లక్ష్యపు ప్రవర్తనకు ఓ గుణపాఠంగా మారాలి. సెల్‌ఫోన్ వినియోగం అపరిమితంగా పెరుగుతున్న ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండే అవసరం ఎంతో ఉంది. టెక్నాలజీ ప్రయోజనాన్ని అనుభవిస్తూ, ప్రాణాలకు ముప్పు తెచ్చుకునేలా ఉండకూడదని ఈ ఘటన మరొక్కసారి నిరూపించింది.





















