Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Tandur Crime News: వికారాబాద్ జిల్లా తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధ మహిళలను పథకం ప్రకారం మొయినాబాద్ తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టారు.

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో ఇద్దరు వృద్ధ మహిళల అదృశ్యం కేసు విషాదంగా మారింది. మిస్సింగ్ కేసు చివరికి మర్డర్ కేసుగా మలుపు తిరిగింది. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు, యాలాల్ పరిధిలో మరొకరు అదృశ్యం కాగా.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్‌కట్ట అటవీప్రాంతంలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితులను తాండూరు ప్రాంతం నుంచి మొయినాబాద్‌కు తీసుకువచ్చి, ఇక్కడి నిర్మానుష్య ప్రదేశంలో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
మృతులను బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా ఆబేదా బేగం, అలాగే తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్ బేగంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులు ఈ హత్యలు ఒకేసారి చేయలేదు. రెండు నెలల క్రితమే ఒక వృద్ధురాలిని దారుణంగా చంపి పూడ్చిపెట్టగా.. మరో వృద్ధురాలిని ఐదు రోజుల క్రితం హత్య చేసినట్లు విచారణలో ప్రాథమికంగా తేలింది.

ఓ మృతురాలి భర్తతో పాటు, స్థానిక ఫామ్‌హౌస్ సెక్యూరిటీ గార్డు హస్తం ఉందని తెలుస్తోంది. వృద్ధురాళ్లను హత్య చేసిన తరువాత మృతదేహాలను మొయినాబాద్ ఫామ్‌హౌస్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టారు. ఈ హత్యల కేసులో తాండూరు గ్రామీణ సీఐతో పాటు యాలాల ఎస్సై రంగంలోకి దిగి అన్ని కోణాల్లో ముమ్మరంగా విచారణ చేపట్టారు. పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















