మే 12న జరిగిన చోరీ కేసులో పోలీసులు నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. వారిని మమత, రమేష్ అని గుర్తించారు.
Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
Hyderabad Crime News | జవహర్‌నగర్‌లోని రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో పోలీసులు ఓ జంటను అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దుల్లో దంపతులను అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు.

- రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులపై నేపాలీ ముఠా దాడి, దోపిడీ.
- నిందితులు కాళ్లు, చేతులు కట్టి మత్తుమందు ఇచ్చి చోరీ చేశారు.
- దంపతుల ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి మాయం.
- దొంగతనం కేసులో నేపాలీ దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 12న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసులో నేపాలీ దంపతులను అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దుల్లో మమత, రమేష్ అనే దంపతులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నాలుగు రోజుల కిందట దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి మత్తు మందు ఇచ్చి 75 తులాల బంగారం, 20 కిలోల వెండి నేపాలీ గ్యాంగ్ ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. మొత్తం 8 మంది వరకు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జవహర్‌నగర్ పోలీసులు ఆ ఇంట్లో హార్డ్ డిస్కులు, సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో భారీ దోపిడీ!
జవహర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి (58) నివసిస్తున్నారు. వీరి వద్ద కొంతకాలంగా ఒక నేపాలీ జంట ఎంతో నమ్మకంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మే 12న రాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకుంటామని నేపాలీ భార్యాభర్తలు పర్మిషన్ అడగడంతో, రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులు మంచి మనసుతో ఒప్పుకున్నారు. నిందితులు కొందరు వ్యక్తులను ఇంటికి పిలిపించగా.. యజమానులైన ప్రొఫెసర్ దంపతులు స్వయంగా దగ్గరుండి వారితో కేక్ కట్ చేయించారు. అయితే, ఆ తర్వాత భోజనం చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా దంపతులపై దాడి చేసి, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ వారి కాళ్లు, చేతులు కట్టేశారు. తమను ప్రాణాలతో వదిలేయాలని ఆ వృద్ధ దంపతులు వేడుకోవడంతో, ఇంట్లోని బంగారం, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
దోపిడీ అనంతరం నిందితులు అంతటితో ఆగకుండా, ఆ దంపతులకు బలవంతంగా మత్తుమందు కలిపిన పదార్థాలను తినిపించారు. అనంతరం వారిని గదిలో బంధించి, బయట తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మత్తు ప్రభావం బలంగా ఉండటంతో మరుసటిరోజు వరకు బాధితులు స్పృహలోకి రాలేకపోయారు. ఆ తర్వాత ఎలాగోలా తేరుకున్న ప్రొఫెసర్ కిటికీలో నుంచి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ పక్కా ప్లాన్ దోపిడీలో సుమారు ఎనిమిది మంది పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం అందగా, మల్కాజిగిరి సీపీ సుమతి ఘటనాస్థలిని సందర్శించి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య తనూజ(60)ను ఇంట్లో పనిచేసే నేపాలీ గ్యాంగ్ హత్య చేసింది. మే మొదటి వారంలో ఈ దారుణమైన దోపిడీ, హత్య జరిగింది. నేపాలీ యువతి (కల్పన) ప్లాన్ తో మరికొందరు గ్యాంగ్ వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న తనూజను హత్య చేయడంతో పాటు ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. తరువాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జవహర్ నగర్ పీఎస్ పరిధిలో మరో నేపాలీ గ్యాంగ్ చోరీ చేసింది. నగరంలో పనిచేస్తున్న నేపాల్ వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పనిమనుషుల పట్ల ఇంటి యజమానులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నగర వాసులకు సూచించారు. ఇంట్లో పనిచేసే సిబ్బంది ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఇంట్లోని బంగారం, భారీ నగదు వంటి వివరాలను పనిమనుషులకు అస్సలు తెలియనివ్వకుండా జాగ్రత్తపడాలని ఆయన స్పష్టం చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
మే 12న జరిగిన చోరీ కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారు?
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో ఎంత బంగారం, వెండి చోరీ అయింది?
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీకి గురైంది. ఈ దోపిడీలో 8 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం.
దొంగలు ప్రొఫెసర్ దంపతులకు ఏమి చేశారు?
దొంగలు ప్రొఫెసర్ దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి, మత్తుమందు ఇచ్చి, ఇంట్లోని బంగారాన్ని, వెండిని దోచుకున్నారు.
ఇంట్లో పనిచేసే వారి పట్ల యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇంట్లో పనిచేసే వారి ప్రవర్తనపై నిఘా ఉంచాలి. అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. ఇంట్లోని నగదు, బంగారం వంటి వివరాలు వారికి తెలియకుండా జాగ్రత్తపడాలి.
ట్రెండింగ్ వార్తలు























