Sri Satyasai: సత్యసాయి జిల్లాలో ఘోరం, ఆటోలో వెళ్తున్న 8 మంది సజీవ దహనం
మొత్తం 8 మంది రైతు కూలీలు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఈ చనిపోయిన వారంతా గుండంపల్లి వాసులుగా గుర్తించారు.
Sri Satyasai District Auto Accident: శ్రీ సత్యసాయి జిల్లాల ఘోరమైన ప్రమాదం జరిగింది. తాడిమర్రి మండలం బుడంపల్లికి చెందిన రైతు కూలీలు ఓ ఆటోలో వెళ్తుండగా, హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి ఆటోపై పడింది. దీంతో వెంటనే మంటలు చెలరేగి పలువురు కూలీలు సజీవ దహనం అయ్యారు. మొత్తం 8 మంది రైతు కూలీలు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఈ చనిపోయిన వారంతా గుండంపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ పనుల కోసం ఓ ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సీఎం విచారం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 30, 2022
ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలంలో జరిగిన ప్రమాదంలో కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నారా లోకేశ్ ట్వీట్
‘‘చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతులకి నివాళులర్పిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలి.’’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఉడతలు కొరకటం వల్ల హైటెన్షన్ వైరు తెగిపడిందట: నారా లోకేశ్
‘‘తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి. ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.