Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ లేఖ, ఏమన్నారంటే?
Telangana News: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ లేఖ, ఏమన్నారంటే? SIB ex chief prabhakararao worte a letter to police in phone tapping case latest updates Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ లేఖ, ఏమన్నారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/0b3089fbc7dedf7316012c1d61d1bfa71720677111940876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
SIB Ex Chief Prabhakara Rao Letter To Police: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు (Prabhakara rao) పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 23న ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. జూన్ 26న తాను ఇండియాకు రావాల్సి ఉందని.. కానీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
'క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నాను. అమెరికా వైద్యుల సూచన మేరకు అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై పూర్తి అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకు వచ్చే వరకూ టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల ఓ పోలీసు అధికారిని. ఎక్కడికీ తప్పించుకుపోయే పారిపోయే పరిస్థితి లేదు. విచారణ ఎదుర్కొంటాను. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేనే ఇండియాకు వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.' అని లేఖలో వివరించారు.
'అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తా'
తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తో పాటు ఇప్పుడు బీపీ పెరిగిందని ప్రభాకరరావు లేఖలో తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులిస్తున్నారని.. దీని వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఓ పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. చట్టపరంగా విచారణ జపించాలని కోరారు. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నాక.. పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని లేఖలో స్పష్టం చేశారు.
కాగా, బీఆర్ఎస్ హయాంలో అనధికారికంగా రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుపైనా ఇప్పటికే నాన్ బెయిలబుల్ పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ఉండగానే పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అంశంపై సిట్ పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది.
Also Read: Dowry Harassment: ఐఏఎస్ ఆఫీసర్‌గా నమ్మించి పెళ్లి, అదనపు కట్నం కోసం వేధింపులతో వెలుగులోకి వాస్తవం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)