Work Stress: '45 రోజులు నిద్ర లేకుండా పని చేశా' - పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య, భార్యకు 5 పేజీల సూసైడ్ నోట్
UttarPradesh News: పని ఒత్తిడి కారణంగా ఓ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. 45 రోజులు నిద్ర లేకుండా పని చేసినట్లు సదరు ఉద్యోగి సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
Finance Employee Forceful Death Due To Work Pressure In UP: పని ఒత్తిడితో కొందరు ప్రైవేట్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోనూ (Uttarapradesh) అలాంటి ఘటనే జరిగింది. ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేసే ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. దాదాపు 45 రోజులుగా నిద్ర లేకుండా విధులు నిర్వహించానని.. పని ఒత్తిడితోనే చనిపోతున్నట్లు సూసైడ్ లేఖలో తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీ ఝాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా (42) ఓ ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే, టార్గెట్లు పెడుతూ అతనిపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సమయానికి పని పూర్తి చేయకుంటే జీతాన్ని కుదిస్తామని బెదిరించేవారు. ఈ క్రమంలోనే టార్గెట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో తరుణ్ 45 రోజులు నిద్ర మానేసి మరీ పని చేశారు. సీనియర్లకు తన సమస్యను వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
5 పేజీల సూసైడ్ నోట్
తరుణ్ సక్సేనా తన భార్యకు 5 పేజీల సూసైడ్ నోట్ రాస్తూ తన ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తనను అధికారులు ఎంతో ఒత్తిడికి గురి చేశారని.. అవమానించడం సహా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. భవిష్యత్తుపై భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
వరుస ఘటనలు
కాగా, పని ఒత్తిడితో ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పని చేస్తోన్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఇటీవలే బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, లఖ్‌నవూలో ఓ బ్యాంకు ఉద్యోగిని విధుల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈమె పని ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా, మరో ఉద్యోగి విధుల్లో ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.