Crime News : అనుకూల తీర్పు ఇప్పిస్తానని రూ. 10 కోట్ల మోసం - మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోదు !
Hyderabad : మలక్ పేట ఎమ్మెల్యేతో పాటు వేదుల వెంకటరమణ అనే లాయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టును మేనేజ్ చేసి అనుకూల తీర్పు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Hyderabad Crime News : మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదైంది. హైకోర్టు సీనియర్ లాయర్ వేదుల వెంకటరమణ తరఫున ఎమ్మెల్యే బలాల బెదిరిస్తున్నారని యాదగిరి అనే వ్యక్తి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ల్యాండ్ విషయంలో అనుకూలంగా తీర్పు ఇప్పిస్తానని లాయర్ వెంకటరమణ మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. రూ.14 కోట్లు డిమాండ్ చేసి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తీర్పు అనుకూలంగా రాకపోగా డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో వెంకటరమణ, బలాలపై కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ
వేదుల వెంకటరమణ తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఆయన చాలా కేసుల్ని వాదించారు. అయితే న్యాయమూర్తినే మ్యానేజ్ చేసి తీర్పు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం న్యాయవాద వర్గాల్లో సైతం సంచలనంగా మారింది. పది కోట్ల రూపాయలు ఇచ్చానని కూడా బాధితుడు చెబుతున్నాడు కాబట్టి.. వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే.. ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేదుల వెంకటరమణ తరపున బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మలక్ పేట ఎమ్మెల్యే కూడా.. ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నారు.
మరో కేసులో కరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐకు హైకోర్టు షాక్
కరీంనగర్ టూ టౌన్ సీఐకి హై కోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. జడ్జి కుమారుడు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సదరు బాధితురాలు ఆరోపించారు. దీంతో 48 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు హై కోర్టుకు హాజరు కావాలని సీఐ వెంకట్‌ను ఆదేశించింది.
మరో కేసులో వివాహిత అనుమానాస్పదమృతి
ముషీరాబాద్‌కు చెందిన వాసం సరిత చిన్న కూతురు సంధ్యారాణి (37)ను జీడిమెట్లకు చెందిన డేగల మధుసూదన్, పుష్పమ్మ చిన్న కుమారుడు సంతోష్ బాబుకు ఇచ్చి 2013లో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో నాలుగున్నర లక్షల కట్నంతో పాటుగా తులం బంగారం కూడా కట్టబెట్టారు. వారిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, వివాహమైన రెండేళ్ల నుంచి దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. భర్తకు తోడు అత్త, ఆడపడుచు, తోటి కోడలు, బావ కూడా సంధ్యారాణిని మాటలతో నిత్యం వేధించేవారని తెలిసింది. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన సంధ్యారాణి హెచ్ఈఎల్ కాలనీలో ఉన్న ఆమె ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది.