Pattiseema : పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి, గోదావరిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు
Pattiseema : పోలవరం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
Pattiseema : పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన అతడి మృతదేహం లభ్యమైంది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసపాడు గ్రామానికి చెందిన ఓలేటి అరవింద్ (20 ) ఎస్కే లుక్మన్ (19) పెద్దిరెడ్డి రాంప్రసాద్ (18 ) మరో నలుగురు పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చారు. పట్టిసీమలో స్నానాల కోసం కేటాయించిన రేవులకు దూరంగా అనధికార రేవులు వద్ద స్నానాలకు దిగారు యువకులు. నది లోతుగా ఉండడం గోదావరి ప్రవాహం వేగం ఎక్కువగా ఉండడంతో ముగ్గురూ కొట్టుకుపోయి నదిలో గల్లంతయ్యారు. సంఘటన ప్రాంతాన్ని పోలవరం డీఎస్పీ లతాకుమారి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోలవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వలో బాలుడు గల్లంతు
బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన ఓ బాలుడు నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గల్లంతు అయ్యాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌లో శుక్రవారం జరిగింది. చింతమళ్ల భాస్కర్, జ్యోతి దంపతలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవలల్లో పెద్దవాడైన అశోక్(14) నిడమనూరు జెడ్పీ హైస్కూలులో చదువుతున్నాడు. గ్రామంలో పండుగ ఉండడంతో భాస్కర్ ఇంటికి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం అశోక్ తన బాబాయితో కలిసి గ్రామంలోని నాగార్జునసాగర్ ఎడమకాల్వలో స్నానానికి వెళ్లాడు. బంధువులు కాల్వలో ఈత కొడుతుండగా ఒడ్డున్న ఉన్న అశోక్ ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటిలో కొట్టుకుపోయాడు. బాలుడిని కాపాడేందుకు బంధువులు ప్రయత్నించినా నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు.
మెదక్ లో విషాదం
మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు నుంచి కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జంట.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి ప్రేమ జంట మృతదేహాలను వెలికితీశారు.
అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరద్దరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల్లో తెలిసిపోయింది. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెళ్లి చేసుకునేందుకు మేము ఒప్పుకోమంటూ చెప్పారు. దీంతో జంట తీవ్ర మనస్తాపానికి గురైంది. కలిసి జీవించలేని తాము కనీసం చావుతోనైనా ఒకటవుదామని భావించారు. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ప్రేమ జంట ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ కలసి నార్సింగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో.. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. వెళ్లి చూసే సరికి కల్పన, ఖలీల్ చెరువులో మృతదేహాలై తేలారు. ఇదే విషయాన్ని పోలీసులు ఇరుకుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆపై మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరిలంచారు. చేతికి అంది వచ్చిన పిల్లలు.. ఇలా చలనం లేకుండా పడి ఉండడం చూసి ఇరుకుటుంబాల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.