Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Kakinada News: ఓ పాఠశాలలో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహనతో ఓ కీచక టీచర్ నిర్వాకం వెలుగుచూసింది. 6వ తరగతి విద్యార్థినులు మహిళా పోలీసుకు విషయం చెప్పగా సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
School Teacher Abused Girl Children In Kakinada: విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికి చెప్పాలో తెలియక గత కొద్ది రోజులుగా విద్యార్థినులు వారిలో వారే బాధ పడ్డారు. చివరకు పాఠశాలలో నిర్వహించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహనతో వారిలో ధైర్యం వచ్చి విషయాన్ని బయటకు చెప్పారు. దీంతో సదరు కీచక ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లి మరీ దేహశుద్ధి చేశారు. పోలీసులు టీచర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని (Kakinada) శ్రీగంటి మోహన బాలయోగి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం వన్ టౌన్ మహిళా పోలీసులు 'గుడ్ టచ్.. బ్యాడ్ టచ్'పై (Good Touch Bad Touch) విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇదంతా విన్న ఆరో తరగతి విద్యార్థినులు కొందరు సదస్సుకు వచ్చిన మహిళా పోలీస్ వద్దకు వచ్చి.. 'అక్కా.. మ్యాథ్స్ టీచర్ మాపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.' అని చెప్పారు.
టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద ఉన్న ఉపాధ్యాయుడిని కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈవో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. వన్ టౌన్ సీఐ వచ్చి టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాల్సిందేనని వారు పట్టుబడుతూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని సీఐ చెప్పడంతో చివరకి అడ్డుతొలిగారు. పోలీసులు కీచక టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వేధింపులకు టీచర్ బలి
అటు, విశాఖ జిల్లాలో (Visakha District) ప్రేమోన్మాది వేధింపులు ఓ టీచర్ బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిలి (Bhimili) మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ యువతి (22) డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పని చేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. ఈ విషయాలేవీ బయటకు రాకుండా గోప్యత పాటించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే