Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Anantapur Road Accident | అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. మంత్రి సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
అనంతపురం: కూలికి వెళ్ళందే పూట గడవని కూలీలు. రోజు లాగానే చేతిలో సద్ది పట్టుకొని కూలి పని కోసం సొంత ఊరికి నుంచి మరో ఊరికి ఆటోలో వెళ్లారు. అరటి తోటలో తమ కూలి పని ముగించుకుని తిరిగి ఆటోలో తమ సొంతూరు కి బయలుదేరారు కూలీలు. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు ఆ కూలీలను కబలించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఐదు మంది అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గార్లదిన్నె మండలం తలగసిన పల్లె సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆటో అటుగా వస్తున్న లారీని బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో కూలి పని చేసి ఇంటికెళ్లి అలసట తీర్చుకోవాల్సిన కూలీలు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది.
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సవిత, కలెక్టర్, ఎస్పీ
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత విచారణ వ్యక్తం చేశారు.రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు - ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఆటోని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వం తరఫున ఆసుపత్రిలో ఐదు మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలిచ్చామన్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరం అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
మృతులు అందరికీ ఒకే గ్రామం కావడంతో తీవ్ర విషాదం
ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు వారంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారు కావటం ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అల్ముకున్నాయి. మృతులు అందరూ కూడా కూడా ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నవారే వీరిలో భార్య భర్తలు కూడా ఉన్నారు. కూలి పనులకు వెళ్ళొస్తామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ గ్రామంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతి చెందిన వారు రామాంజి నమ్మ, బాల పెద్దయ్య, నాగమ్మ, నాగన్న, జయరాం, కొండమ్మ, ఈశ్వరయ్య, డి నాగమ్మ. వీరిలో ఇద్దరు ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే మృతి చెందగా మిగిలిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఐదు మంది ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అమృతల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రి వద్దకు వెళ్లి వారి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రమాదాలు అక్కడే ఎక్కువ ఎందుకు అవుతున్నాయి :
బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి అలా తరచూ ప్రమాదాలు జరిగే పాయింట్లు పోలీసులు గుర్తించి బ్లాక్ పాయింట్లుగా గుర్తిస్తారు. అక్కడ ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిక బోర్డులు కూడా ప్రయాణికులకు కనిపించే విధంగా పెడతారు. అయినప్పటికీ గార్లదిన్నె మండలం తలకాశి పల్లె సమీపంలో ప్రమాదకరంగా మలుపు ఉందని ఇక్కడ నెల రోజుల కిందట ఒక ఐచర్ వాహనంలో కూలీలు వెళుతుండగా వెనకనుంచి ప్రైవేటు బస్సు ఢీకొని 13 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంఘటన స్థలం సమీపంలోనే గతంలో ఒక ఆయిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు కూడా ఢీకొన్నాయి. ఇలాంటి మలుపుల్లో జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు సరిగా లేకపోవడం మలుపులో వంతెనలు నిర్మించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శ కూడా ఉంది. ఇలాంటి బ్లాక్ స్పాట్స్ పై ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహన చోదకులు జాతీయ రహదారి సమీప గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.