Palnadu: కొడుకు తల తెగనరికేసిన తండ్రి, సంచిలో ఉంచి ఊళ్లో సంచారం! గుండెపగిలే ఆవేదనలో తల్లి
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కిషోర్ తల్లి గల్ఫ్ దేశంలో సంపాదన కోసం పనులు చేసేందుకు వెళ్లి అక్కడి నుండి కొడుకు కిషోర్ కు డబ్బులు పంపుతోందని తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరయ్య (45) అనే వ్యక్తి కొడుకు కిషోర్ (25) ను అతి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తలను మొండెం నుండి వేరు చేసి తండ్రి వీరయ్య తలను గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు తెలిపారు. స్థానికుల సమాచారంతో నిందితుడిని నకరికల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అయితే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కిషోర్ తల్లి గల్ఫ్ దేశంలో సంపాదన కోసం పనులు చేసేందుకు వెళ్లి అక్కడి నుండి కొడుకు కిషోర్ కు డబ్బులు పంపుతోందని తెలిపారు. మందుకు బానిసైన కిషోర్ తండ్రి వీరయ్య కొడుకును మందు కోసం తరచూ డబ్బులు అడుగుతుండటంతో కొడుకు ఇవ్వలేదని చెప్పారు. ఆ కోపంతోనే తండ్రి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు వివరించారు.
మృతుడు బత్తుల కిషోర్ అలియాస్ అశోక్ తండ్రి వీరయ్య చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురైన విషయాన్ని గ్రామస్థులు హతుడి తల్లికి తెలిపారు. దీంతో కువైట్‌లో ఉంటున్న మృతుని తల్లి బత్తుల అలివేలు వీడియో కాల్ లో విపరీతంగా కన్నీరు మున్నీరైంది. తమ కుటుంబంలో కొడుకు, కూతురుకు పెళ్లిళ్లు చేయడంతో 5 లక్షలు అప్పులయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి, కొడుకులు తాగుబోతులు అవడంతో అప్పు తీర్చేందుకు కువైట్ లో పనులు చేసుకునేందుకు రెండు సంవత్సరాల ఒప్పందంపై వచ్చానని వాపోయింది. అయితే, తన కుమారుడు తండ్రి చేతిలో మృతి చెందాడని తెలిసినప్పటి నుండి తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.
కుమారుని మృతదేహాన్ని చివరిచూపు చూసుకోవాలని ఉందని, అక్కడి యజమాని ఒప్పుకోవడం లేదని రోధిస్తూ చెప్పడం గ్రామస్థులను కలచివేసింది. ఎలాగైనా తనను ఇక్కడి నుండి ఇండియాకు తీసుకువచ్చే విధంగా చేయాలని మృతుని తల్లి బత్తుల అలివేలు వేడుకుంటోంది.