Ysrcp leader Attack: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్
బాలినేని జన్మదిన వేడుకల్లో కొడాలి, వంశీ, అంబటిపై విమర్శలు చేసిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావుపై గుంటూరులో దాడి జరిగింది. ఓ లాడ్జ్ లో తలదాచుకున్న సోమిశెట్టిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావుపై దాడి జరిగింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ చంపేస్తానని బెదిరించారు కొందరు వ్యక్తులు. వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశాయి. ఇటీవల వైసీపీ నేతల తీరుపై సుబ్బారావు విమర్శలు చేశారు. దీంతో ఆయనపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతనే విమర్శిస్తావా అంటూ వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ నేతల వైఖరిని విమర్శించిన సుబ్బారావు గుప్తా ఇంటిపై మొన్న రాత్రి కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న సుబ్బారావు.. గంటూరులోని ఓ లాడ్జిలో దాక్కున్నాడు. అతడి సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త సుభాని, మరికొందరు మంత్రి బాలినేనినే విమర్శిస్తావా అంటూ లాడ్జికి వెళ్లి సుబ్బారావును కొట్టారు. ఎవరు చెబితే విమర్శలు చేశావని ప్రశ్నిస్తూ చితక్కొట్టారు. సుబ్బారావును మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణ చెప్పించి వీడియో తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?
వైరల్ అయిన సోమిశెట్టి వీడియో
ఇటీవల ఓ కార్యక్రమంలో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రువులో, శత్రువులో అర్థం కావడం లేదని సుబ్బారావు అన్నారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలా జరిగితే పార్టీకి తీవ్ర నష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపడితే కర్రలు తీసుకుని వెంటబడి కొడతారని వ్యాఖ్యలు చేశారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేతలు తీరు మార్చుకోకపోతే పార్టీకి భారీ నష్టమని, ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అప్పట్లో 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని సోమిశెట్టి విమర్శించాడు.
Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
బాలినేనిపై విమర్శలు
పార్టీలో ఉంటూ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మిత్రులా, శత్రువులా, కోవర్టు ఆపరేషనా అనేది అర్థం కావడం లేదని వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పనిచేస్తే పార్టీతో పాటు అందరికీ మేలు అని అభిప్రాయపడ్డారు. పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా వాసన్న, జగనన్న అభిమానిగా ఉంటానన్నారు. సమర్థులకు పదవులు లేవని బాలినేని వాసన్న పొగడేవాళ్లకే ఇస్తున్నారని విమర్శించారు. కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తే భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. సోమిశెట్టి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడులు చేశారు. ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. వాళ్ల దాడి నుంచి తప్పించుకున్న సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి