Paritala Vs Suri : టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన చేరికను పరిటాల శ్రీరాం వ్యతిరేకిస్తున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ రాజకీయాలు అసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్ చురుగ్గా పర్యటిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ నేత. మాజీ ఎమ్మెల్యే కూడా. గత ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన తరపున కొంత మంది టీడీపీ నేతలు కూడా వకాల్తా పుచ్చుకుని చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.
అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరారన్న ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు నాయుుడు ఆయన చేరికపై అంత సముఖంగా లేరని చెబుతున్నారు. వరదాపురం సూరీ బీజేపీలో చేరిన తర్వాత పరిటాల శ్రీరామ్‌కు బాధ్యతలిచ్చారు. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించకపోయినా ఇప్పుడు శ్రీరామ్.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ధీటుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. ధర్మవరంలో కూడా పరిటాలకు బలమైన వర్గం ఉంది. పరిటాల వర్గానికి వరదాపురం సూరివర్గానికి పడేది కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మవరం రాజకీయాల్లో పరిటాల వర్గాన్ని సూరి వేలు పెట్టనీయలేదు.
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
సూరి బీజేపీలో చేరిన తర్వాత పరిటాల వర్గం యాక్టివ్ అయింది. వైఎస్ఆర్‌సీపీ నేతలతో పోటీ పడి రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది పరిటాల శ్రీరామేనని నిన్నామొన్నటి వరకూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు వరదాపురం సూరి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పరిటాల శ్రీరామ్ దూకుడైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను సూరిని పార్టీలోకి రానిచ్చే సమస్యే లేదని,ఒకవేళ వస్తే తానే కండువా కప్పాల్సివస్తుందని,వచ్చిన తరువాత పార్టీకోసం కష్టపడితే అప్పుడు పదువులపై తానే రెకమెండ్ చేస్తానంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వేళ తన మాట కాదని ఆయన్ను పార్టీలోకి చేర్చుకొంటే రాజకీయ సన్యాసం చేస్తానంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
Also Read: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని.. పరిటాల శ్రీరాం రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని సవాల్చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో వున్నపుడు పార్టీ మారిన సూరిని మళ్ళీ ఏ విధంగా చేర్చుకొంటారంటూ పరిటాల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ సూరికి అవకాశమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వలస నేతలు మళ్లీ పార్టీలోకి క్యూ కట్టే అవకాశాలు వున్నాయని వచ్చే నెలలోసూరి చేరిక ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తంగా చూస్తే వరదాపురం సూరి చేరికను అడ్డుకోవాలని పరిటాల వర్గంర గట్టిగా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఆలోచనను బట్టే చేరికలు ఉండే అవకాశం ఉంది.
Also Read: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి