Siricilla News: నిద్రిస్తున్న వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలు - సిరిసిల్ల జిల్లాలో ఘోరం
Telangana News: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని పిచ్చికుక్కలు పీక్కు తిన్న దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

Old Woman Died By Dog Bites In Siricilla: తెలంగాణలో ఇటీవల కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు అందరిపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Siricilla District) ఘోరం జరిగింది. నిద్తిస్తోన్న వృద్ధురాలిపై పిచ్చికుక్కలు దాడి చేయగా ఆమె మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి (80) అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ గదిలో ఉంచి ఆహారం అందిస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి వృద్ధురాలికి భోజనం చేయించి.. ఇంట్లో పడుకోబెట్టి వెళ్లారు.
గుంపుగా దాడి
వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పిచ్చికుక్కల గుంపు ఇంట్లో ప్రవేశించి ఆమెపై దాడి చేశాయి. గొంతు, చేతులు, ఇతర అవయవాలను పీక్కుతిన్నాయి. ఉదయం లేచి చూసేసరికి రక్తపు మడుగులో వృద్ధురాలు విగతజీవిగా పడి ఉంది. ఆమె పక్కనే దాడి చేసిన ఓ కుక్క ఉండగా.. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దానిపై దాడి చేసి చంపేశారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో దారుణం
అటు, నాగర్ కర్నూల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి కన్న కొడుకునే గోనెసంచిలో కట్టి చెరువులో పడేసిన ఘటన కొల్లాపూర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌లో ఓ తండ్రి కన్న కొడుకుపై దారుణంగా ప్రవర్తించాడు. కొడుకు సరిగ్గా చదవట్లేదని విచక్షణ కోల్పోయి బాలున్ని గోనెసంచిలో కట్టేసి చెరువులో పడేశాడు. బాలుడు ఏడుపు విన్న స్థానికులు రక్షించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా.. బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

