Nizamabad Crime: మళ్లీ కత్తిపోట్ల కలకలం, ఫ్యాక్షన్‌ను తలపిస్తున్న నిజామాబాద్ - జిల్లాలో అసలేం జరుగుతోంది !
Knife Attack Cases In Nizamabad: ఫ్యాక్షన్‌ను తలపించే విధంగా కత్తులతో దాడులు జరుగుతుండటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో కత్తులతో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కత్తులతో దాడి చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ఫ్యాక్షన్‌ను తలపించే విధంగా కత్తులతో దాడులు జరుగుతుండటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో కత్తులతో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. గత కొన్ని రోజులుగా 1వ టౌన్, 6వ టౌన్, తో పాటు 5వ టౌన్ పరిధిలో మరణాయుధాలతో దాడులు చేసుకుంటున్న కేసుల నమోదవుతున్నాయి. నిజామాబాద్ 1వ టౌన్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 1 టౌన్, 5, 6 టౌన్ పరిధిలోనే కత్తులతో దాడులు జరగటం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వన్ టౌన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం..
తాజాగా నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో నిన్న రాత్రి కత్తిపోట్లు కలకలం రేపాయి. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫజల్, ముజాహిద్దీన్ అనే ఇద్దరు అన్నదమ్ములపై.. సాజిద్, జుబైర్, షెరాజ్, ఇర్ఫాన్, నుయాని, సుల్తాన్ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్క్రాప్ వ్యాపారం చేసే ఫజల్ టార్పాలిన్స్ చింపివేశాడన్న కోపంతో దాడులకు తెగబడ్డట్టు బాధితులు ఫజల్, ముజాహిద్దీన్ తల్లి హసీనా బేగం చెబుతున్నారు. కానీ, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో సుల్తాన్ పట్టుబడటంతో.. అది ఫజల్ పనేనన్న అనుమానంతో దాడికి పాల్పడ్డట్టు మరో వాదన. కత్తిపోట్లతో ముజాహిద్దీన్ కుడిచేయి మధ్య వేలు తెగిపోగా.. ఫజల్ ఎడమ చేయికి గాయాలయ్యాయి. బాధితుల తల్లి హనీనా బేగం ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల వరుస ఘటనలు...
జూన్ 24వ తేదీన నాగారం ఏరియాలో ఆటో డ్రైవర్ హారన్ కొట్టాడని ఆటోలో ఉన్న యువకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ నెల 3వ తేదీన కామారెడ్డి జిల్లాలో భూ వివాదంలో ఇద్దరిపై కత్తులతో దాడి జరిగింది. తాజాగా నిజామాబాద్ నగరంలో ఇద్దరిపై కత్తులతో దాడులు జరగటం ఆందోళన కలిగిస్తోంది. కత్తులతో దాడుల కల్చర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సుపారీలు ఇచ్చి హతమార్చేదుకు వెనుకాడటం లేదు. నగరంలో వన్ టౌన్ పరిధిలో ఈ దాడులు పెరిగిపోయాయి. పోలీసుల నిఘాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏరియాలో రాత్రుల్లో కూడా హోటల్స్ తెరిచే ఉంటున్నాయి. పోలీసులు ఆ ఏరియాపై నిఘా ఉంచటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వన్ టౌన్ పరిధిలో దాడులు పెరిగిపోతున్నాయి. మూడు నెలల క్రితం ఓ హోటల్ లో యజమానిపై కొందరు గూండాలు విచక్షణ రహితంగా దాడి చేశారు. 6 నెలల కిందట ఓ వ్యక్తి తన బర్త్ డే సందర్భంగా... ఫామ్‌హౌస్‌లో తుపాకీ పేల్చి హల్ చల్ చేశాడు.
ప్రభావం చూపని పీడీ యాక్టులు..
పీడి యాక్టులు పెట్టి జైలుకు పంపినా కొందరు నిందితుల్లో మార్పు రావడం లేదు. కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని రౌడీ షీటర్లకు చట్టాలంటే భయం లేదా, లేక జైలుకెళ్లినా తమను ఎవరో ఒకరు బయటకు తీసుకొస్తారని ఇలా దాడులకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.