Nellore Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ కు యువకుడు బలి... నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడిని బలి తీసుకుంది. బెట్టింగ్ ముఠా వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్రికెట్ బెట్టింగ్ జీవితాలను బలితీసుకుంటుంది. ఆ ఊబిలో దిగినవారెవరూ బయటకు రాలేకపోతున్నారు. ఒక మ్యాచ్ లో పోయిన డబ్బు మరో మ్యాచ్ లో అయినా వస్తుందనే ఆశతో అప్పులు చేస్తున్నారు. చివరకు అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కి ఓ యువకుడు బలయ్యాడు.
నెల్లూరు బెట్టింగ్ కి కేరాఫ్ అడ్రస్
నెల్లూరు జిల్లా క్రికెట్ బెట్టింగ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతంలో జిల్లా కేంద్రంగా పనిచేసే క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బెట్టింగ్ లో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లభించలేదు. అయితే అప్పటినుంచీ క్రికెట్ బెట్టింగ్ పేరు చెబితేనే నెల్లూరు జిల్లా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...
టార్గెట్ యువతే..
కాలేజీ కుర్రకారు, యువత ప్రధానంగా బెట్టింగ్ మాఫియాకు లక్ష్యం అవుతున్నారు. బెట్టింగ్ ఊబిలో చిక్కుకుపోతున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు బెట్టింగ్ కి బలయ్యాడు. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి మండలం హరిజన కాలనీకి చెందిన 26 ఏళ్ల బలమూడి మధు అనే యువకుడు బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: పోలీస్ స్టేషన్ లో ప్రేమ పంచాయితీ... తల్లిదండ్రులకు కౌన్సెలింగ్... కానీ
బెట్టింగ్ లో రూ. 50 వేలు పోయాయని ఆత్మహత్య
కావలి పీజీ కాలేజీ ఫారెస్ట్ లో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి చనిపోయాడు మధు. తన బావమరిదికి సోమవారం ఫోన్ చేసి క్రికెట్ బెట్టింగ్ లో రూ.50 వేలు పోగొట్టుకున్నానని మధు చెప్పాడు. ఆ వెంటనే ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఫోన్ చేయగా అతని నుంచి సమాధానం లేదు. రాత్రి నుంచి మధు కోసం అతని బావమరిది వెదుకుతున్నాడు. చివరకు ఈరోజు ఉదయం అడవిలో శవమై కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఐపీఎల్ కారణంగానే తన బావ ఆత్మహత్య చేసుకున్నాడని అతని బావమరిది శివకృష్ణ ఆరోపించారు. ఆస్పత్రి వద్ద బందువుల రోధనలు మిన్నంటాయి.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైన తర్వాత పోలీసులు బెట్టింగ్ పై నిఘా పెట్టారు. అయితే పోలీసుల కళ్లుగప్పి బెట్టింగ్ ముఠాలు వీటిని నిర్వహిస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్ కి అలవాటైనవారు ఆర్థికంగా నష్టపోతున్నారు. కుటుంబ సభ్యులను కష్టాలపాలు చేస్తున్నారు. చివరకు అప్పులపాలై ఇలా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఫేస్ బుక్ లైవ్ పెట్టి వ్యక్తి ఆత్మహత్య.. కారణం భార్య, అత్తేనా?