DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
బెంగళూరులో డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
DK SrinivaS Arrest : మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్‌ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ( NCB ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కు భారీ కార్పొరేట్ ఆస్పత్రిలో భాగస్వామ్యం కూడా ఉంది. అయితే ఆయన డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం ఎన్‌సీపీకి చేరింది. అదే సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్నట్లుగా తెలియడంతో ఎయిర్ పోర్టులో ఎన్సీబీ అధికారులు కాపు కాశారు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. సదాశివనగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అర్థరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత అరెస్ట్ చూపించారు.
శ్రీనివాస్‌ది హైప్రోఫైల్ డ్రగ్స్ స్టోరీ !
అరెస్ట్ తర్వాత యలహంకలోని ఎన్‌సీబీ కార్యాలయానికి ( NCB Office ) తరలించారు. సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీనివాస్‌కు ఇద్దరు పిల్లలు, ఒకరు ఆది, మరొకరు గీతావిష్ణు. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో గీతావిష్ణు పేరు కూడా వినిపించింది. డీకే శ్రీనివాస్‌తో పాటు ఓ కన్నడ సినీ నటుడిని కూడా ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకన్నట్టుగా తెలుస్తోంది. ఇక, శ్రీనివాస్ ఇంట్లో భారీగా డ్రగ్స్ దొరికినట్టుగా సమాచారం. మరోవైపు శ్రీనివాస్‌తో పాటు మరికొందరి ఇళ్లలో కూడా ఎన్‌సీబీ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర, కర్ణాటక పలువురికి శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఎన్‌సీబీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, తెలుగు, రాజకీయ సినీ ప్రముఖులతో శ్రీనివాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
రాజకీయంగా యాక్టివ్‌గా లేని డీకే ఫ్యామిలీ
డీకే ఆదికేశవులు నాయుడు గతంలో టీడీపీలో ఉండేవారు. ఓ సారి పార్టీని ధిక్కరించి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబం మళ్లీ టీడీపీలో చేరింది. 2014లో డీకే శ్రీనివాస్ నాయుడు తల్లి సత్యప్రభ చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. 2020లో తిరుమలలో సీఎం జగన్‌ను డీకే శ్రీనివాస్ కలిశారు. అయితే పార్టీలో చేరినట్లుగా స్పష్టత లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి , డీకే శ్రీనివాస్ సన్నిహిత మిత్రులని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది. బెంగళూరులో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉండటంతో వారు అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.