Guntur: అక్క భర్తతో లైంగిక సంబంధం! భర్తకు మందులో సైనెడ్ - ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు
Narasaraopet: 2017 ఏడాదిలో ఈ నేరం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగి పురం మండలానికి చెందిన ఓ మహిళ తన అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు వస్తున్నాడని తొలగించుకుంది.
వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో చాటే మరో ఘటన ఇది. ఈ వ్యవహారంలో చివరికి నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. తాత్కాలిక శారీరక సుఖాల కోసం తహతహలాడి పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని కాలదన్నుకొన్న మహిళ ఇక జీవితాంతం జైలు శిక్ష అనుభవించనుంది. అక్క భర్తతో వివాహేతర సంబంధం, అందుకు అడ్డు వస్తు్న్నాడని భర్తను మూడేళ్ల క్రితం అంతం చేసింది. తాజాగా ఇప్పుడు ఆ కేసులో ఆమెతో పాటు సహకరించిన వారికి కూడా కోర్టు శిక్ష వేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 ఏడాదిలో ఈ నేరం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగి పురం మండలానికి చెందిన ఓ మహిళ తన అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు వస్తున్నాడని తొలగించుకుంది. ఆమెకు సహకరించిన ప్రియుడైన బావ, మరో ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. ఫిరంగి పురం మండలం పొనుపాడుకి చెందిన నల్లబోతు నరేంద్ర అనే వ్యక్తి తన సమీప చుట్టాల్లోనే, ప్రైవేటు పాఠశాల టీచర్‌గా పని చేసే శ్రీవిద్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇతను పేరేచర్లలోని ఓ ఇండస్ట్రీలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. వీరికి పిల్లలు లేరు.
అక్క ఇంటి నుంచే ప్లాన్
అయితే, పెళ్లికి ముందు నుంచే తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో ఈమెకు వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా వీరు ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. ఈ విషయం ఆమె భర్త నరేంద్రకు తెలిసింది. భర్తకు తెలిసిన విషయం భార్యకు కూడా తెలిసిపోయింది. దీంతో భర్తను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. నరసరావు పేట పెద్ద చెరువు గ్రామంలో నివాసం ఉండే తన ప్రియుడి ఇంటి నుంచే ప్రణాళిక రచించింది.
ఈ మేరకు 2017 డిసెంబరు 19న భర్తకు తన ప్రియుడైన బావతో ఫోన్ చేయించి, నరసరావుపేటలోని ఓ బార్ కి రమ్మని పిలిపించింది. గతంలో పరిచయం ఉన్న స్నేహితుల్ని కూడా పిలిపించి అంతా రెస్టారెంట్‌లో ఫూటుగా నరేంద్రకు తాగించారు. తర్వాత తన అప్పు వసూలు చేసుకొనేందుకు మార్కాపురం వెళుతున్నట్లు చెప్పి తోడుగా నరేంద్ర సాయం కోరారు. అతణ్ని కారులో ఒంటరిగా ఎక్కించుకుని బయలుదేరారు. మధ్యలో మెల్లగా సైనెడ్ తీసి, మందులో కలిపి నరేంద్రతో తాగించారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. తిరిగి మృతదేహాన్ని పెద్దనందిపాడు కాలువ కట్టపైన పడేశారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందుకోసం చనిపోయిన నరేంద్ర మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా పెట్టి అక్కడి నుంచి జారుకున్నారు.
పోలీసుల ఎంట్రీతో బట్టబయలు
తన కుమారుడు నరేంద్ర చనిపోవడంతో అతని తండ్రి వీరయ్య పోలీసులకు 2017 డిసెంబరులో కంప్లైంట్ ఇచ్చాడు. నరేంద్ర వేసుకున్న చెప్పు, సెల్ ఫోన్ డేటాతో పాటు మెసేజ్‌లు అన్నీ పరిశీలించారు. అతను వేసుకున్న రెండో చెప్పు నిందితులు వాడిన కారులో దొరకడంతో సాక్ష్యాధారాలతో సహా నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నరసరావుపేట సెషన్స్ కోర్టులో విచారణ జరిగి నేరం రుజువు అయింది. దీంతో నిందితులను దోషులుగా తేల్చుతూ జడ్జి నలుగురికి జీవిత ఖైదు విధించారు. మరో వెయ్యి రూపాయలు జరిమానా కూడా వేశారు.