Lovers Suicide: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రకాశం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
lovers commits suicide in Prakasam District | తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో నంద్యాల జిల్లాకు చెందిన ప్రేమ జంట ప్రకాశం జిల్లాలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Nandyal lovers Suicide | కొమరోలు: ప్రకాశం జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట బలవన్మరణం చెందడంతో విషాదం నెలకొంది. కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో యువతి, యువకుడు చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతులను నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి వారిగా గుర్తించారు. ఎలాగూ కలిసి జీవించలేం, చావులో నైనా ఒకటిగా ఉండాలని భావించి.. చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఏడాది మార్చిలో ఇలాంటి తరహా ఘటన..
కరీంనగర్: ప్రతి చిన్న విషయానికి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ కొందరు, నచ్చిన బైక్, ఫోన్ కొనివ్వలేదని, ప్రేమలో విఫలమయ్యామని, తల్లిదండ్రులు మందలించారని సైతం సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో యువతీ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
నిర్మల్ జిల్లాకు చెందిన యువతి కరీంనగర్‌లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియాలో ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి రాహుల్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాహుల్ ఆమె కంటే రెండేళ్లు చిన్నవాడు, చదువు మానేసి జాబ్ చేస్తున్నాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరన్న భయంతో జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాపయ్య పల్లె గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి బలవన్మరణం రెండు కుటుంబాలలో విషాదాన్ని నిపింది.
గత ఏడాది గుంటూరు జిల్లాలో విషాదం
ఏపీలో గుంటూరు జిల్లాలో ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఓ ప్రేమ జంట తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన యువతి( 21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా పూర్తి చేసిన మహేశ్ హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో పనిచేశాడు. ఆ సమయంలో యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి ప్రేమపెళ్లికి అబ్బాయి కుటుంబం అంగీకరించగా.. అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో చావులోనైనా కలిసి ఉండాలని భావించి క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. రైలు కింద పడి బలవన్మరణం చెందారు.






















