Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Pregnancy Test at Home : పీరియడ్స్ ఆగిపోయిన వెంటనే చాలామందికి వచ్చే డౌట్ ప్రెగ్నెన్సీనా అని. మీకు ఈ డౌట్ ఉంటే ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? డాక్టర్ని ఎప్పుడు కలిస్తే మంచిదో తెలుసా?

- పీరియడ్స్ ఆలస్యానికి గర్భంతో పాటు ఇతర కారణాలు చాలా ఉన్నాయి.
- మిస్ అయిన వారం తర్వాత పరీక్ష కచ్చితమైన ఫలితం ఇస్తుంది.
- నెగెటివ్ వచ్చినా పీరియడ్స్ రాకుంటే వైద్యుడిని సంప్రదించాలి.
- పాజిటివ్ లేదా ప్రమాద లక్షణాలుంటే వెంటనే వైద్యుని సలహా పొందండి.
Pregnancy Test Tips : పీరియడ్స్ రావాల్సిన తేదీ దాటిపోయినా రాకపోతే చాలామందికి ముందుగా వచ్చే డౌట్ ప్రెగ్నెన్సీ వచ్చిందా? అని ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి అవకాశం ఉన్న సందర్భంలో పీరియడ్స్ ఆలస్యం కావడం కనిపిస్తే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అయితే పీరియడ్స్ ఆలస్యం కావడానికి ప్రెగ్నెన్సీ ఒక్కటే కారణం కాదు. ఒత్తిడి, బరువులో మార్పులు, అధిక వ్యాయామం, హార్మోన్ల సమస్యలు, PCOS, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాలతో కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. అందుకే సరైన సమయంలో టెస్ట్ చేయడం, ఫలితాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవడం ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు.
పీరియడ్స్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చా?
సాధారణంగా పీరియడ్స్ రావాల్సిన తేదీ దాటిన మొదటి రోజు నుంచే హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు పార్టనర్‌తో కలిశాము.. ప్రెగ్నెన్సీ వస్తుందని నమ్ముతున్నట్లయితే టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు లైంగిక ప్రక్రియలో ఆ నెల పాల్గొనకపోతే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే పీరియడ్స్ మిస్ అయిన తేది దాటిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ఫలితం కచ్చితంగా రావాల్సిన అవసరం ఉండదు.
ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు శరీరంలో hCG అనే హార్మోన్ పెరుగుతుంది. హోమ్ ప్రెగ్నెన్సీ టెస్టులు మూత్రంలో ఈ హార్మోన్‌ను గుర్తిస్తాయి. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో hCG స్థాయులు తక్కువగా ఉంటే టెస్ట్ నెగెటివ్‌గా రావచ్చు.
Also Read : మహిళల్లో ఈ వయసు తర్వాత ప్రెగ్నెన్సీ కష్టమా? ఫెర్టిలిటీ నిపుణులు ఏమంటున్నారంటే..
కరెక్ట్ ఫలితం కోసం ఎప్పుడు టెస్ట్ చేయాలి?
పీరియడ్స్ మిస్ అయిన తర్వాత కొన్ని రోజులు వేచి చూసి టెస్ట్ చేయడం వల్ల ఫలితం మరింత స్పష్టంగా రావచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ రావాల్సిన తేదీ నుంచి ఒక వారం వరకు రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
మీ పీరియడ్స్ సైకిల్ రెగ్యులర్‌గా లేకపోతే పీరియడ్స్ మిస్ అయిన రోజు లెక్కించడం కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చివరిసారిగా అసురక్షిత లైంగిక సంబంధం జరిగిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదయం మూత్రంతో టెస్ట్ చేయాలా?
హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పుడు ఉదయాన్నే మొదటి మూత్రం ఉపయోగించడం మంచిది. ఆ సమయంలో మూత్రం ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటంతో hCG గుర్తించే అవకాశం మెరుగ్గా ఉంటుంది. అయితే టెస్ట్ కిట్‌పై ఉన్న సూచనలను తప్పకుండా పాటించాలి. గడువు ముగిసిన కిట్ ఉపయోగించకూడదు.
టెస్ట్ నెగెటివ్ వచ్చినా.. పీరియడ్స్ రాకుంటే
పీరియడ్స్ మిస్ అయిన వెంటనే టెస్ట్ చేసి నెగెటివ్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాలేదు అని నిర్ణయించుకోకండి. చాలా తొందరగా టెస్ట్ చేయడం వల్ల hCG స్థాయులు గుర్తించేంతగా పెరగకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయవచ్చు. రెండోసారి కూడా నెగెటివ్ వచ్చినా పీరియడ్స్ రాకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
Also Read : ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఫెయిల్ అవుతున్నారా? సంతాన్నాన్ని దూరం చేస్తోన్న అలవాట్లు ఇవే
టెస్ట్ పాజిటివ్ వస్తే డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యులు రక్త పరీక్ష లేదా అల్ట్రాసౌండ్ సూచించవచ్చు. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించడం వల్ల అవసరమైన మందులు, ఫోలిక్ యాసిడ్, ఆహారం, జీవనశైలి, తదుపరి చెకప్‌ల గురించి పూర్తి డిటైల్స్ పొందవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీకి అవకాశం ఉండి పీరియడ్స్ రాకపోతే ముందుగా హోమ్ టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ నెగెటివ్‌గా ఉన్నా మళ్లీ టెస్ట్ చేసిన తర్వాత కూడా పీరియడ్స్ రాకపోతే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను కలవండి
పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌తో పాటు కింది లక్షణాలు ఉంటే సాధారణ అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉండకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన కడుపునొప్పి, ముఖ్యంగా ఒక వైపు ఎక్కువగా ఉండటం, ఎక్కువగా లేదా అసాధారణంగా యోని నుంచి రక్తస్రావం జరగడం, భుజం చివర నొప్పి, తీవ్రమైన తల తిరగడం లేదా మూర్ఛ రావడం, అకస్మాత్తుగా తీవ్రమైన బలహీనత వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణం కావచ్చు.
ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగెటివ్‌గా ఉన్నా పీరియడ్స్ రాకపోతే కారణం తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒత్తిడి, ఆందోళన, బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం, అధికంగా వ్యాయామం చేయడం, PCOS, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పులు, నిద్రలో మార్పులు, కొన్ని మందుల ప్రభావం కూడా పీరియడ్స్ ఆలస్యం చేస్తాయి. కాబట్టి కంగారు పడకుండా పీరియడ్స్ ఎందుకు ఆగాయో తెలిసి.. దానికి తగ్గట్లు చికిత్స తీసుకోవడం మంచిది.
Also Read : ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుంది.. గర్భధారణలో ముఖ్యమైన ఈ మూడు దశలు మీకు తెలుసా?
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























