Mancherial News : దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!
Mancherial News : దళిత బంధు పేరుతో వివాహితపై స్థానికనేత వేధింపులకు పాల్పడుతున్నాడు. అందుకు భర్త సహకరిస్తుండడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Mancherial News : మంచిర్యాల జిల్లాలో దళిత బంధు పేరుతో ఓ వివాహితను లోబర్చుకునేందుకు యత్నించాడు ఎంపీపీ భర్త. భార్య భర్తల మధ్య గొడవలో తలదూర్చి వివాహితను తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు హజిపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్. తన భర్త రామగిరి సురేష్ కు దళిత బంధు ఇచ్చేందుకు మందపల్లి శ్రీనివాస్ వేధింపులకు గురిచేస్తున్నాడని వివాహిత పోలీసులను ఆశ్రయించింది.
అసలేం జరిగింది?
దళిత బంధు పేరుతో అధికార పార్టీకి చెందిన ఓ నేత వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆ వివాహిత మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. మంచిర్యాల జిల్లా ఊరు శ్రీరాంపూర్ కు చెందిన వివాహిత భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంది. ఇదే క్రమంలో హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన రామగిరి సురేష్ కు పరిచయం ఏర్పడడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయించడంతో పెద్ద మనుషుల ఒప్పందంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ ఒప్పందంలోనే వివాహితను హాజీపూర్ మండల ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ తన భర్త ద్వారా వేధింపులకు గురి చేస్తున్నాడని వివాహిత ఆరోపించింది. దీంతో శుక్రవారం మంచిర్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన రెండో భర్త రామడుగు సురేష్ తనను ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ తో ఉండాలంటూ రోజు ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. లేకపోతే తనకు దళిత బంధు రాకుండా చేస్తాడని అంటున్నాడని తెలిపింది. ఎంపీపీ భర్త శ్రీనివాస్ తో ఉండకపోతే తనను, తన కొడుకును చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.