Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు వ్యక్తిని కొట్టిన హోటల్ సిబ్బంది- దాడితో మృతి చెందిన కస్టమర్
Hyderabad Crime News: బిర్యానీ తినేందుకు హోటల్ కు వెళ్లిన ఓ వ్యక్తితో అక్కడి సిబ్బంది గొడవ పడ్డారు. అతడిని తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించాడు.
Hyderabad Crime News: బిర్యానీ తినేందుకని హోటల్ కు వెళ్లాడో వ్యక్తి. ఎక్స్ ట్రా పెరుగు తీసుకురమ్మని సిబ్బందిని అడగడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చేసుకుంది. అదికాస్తా ఎక్కువవడంతో.. సిబ్బంది అంతా కలిసి అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందతూ అతడు మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చాంద్రాయణగుట్టకు చెందిన లియాకత్ అనే వ్యక్తి.. బిర్యానీ తినేందుకు స్థానికంగా ఉన్న హోటల్ కు వెళ్లాడు. అక్కడే బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాడు. అయితే తనకు పెరుగు చాలకపోవడంతో.. ఎక్స్ ట్రా పెరుగు కావాలని సిబ్బందిని కోరాడు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే స్థానికుల సాయంతో గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. హోటల్ కు చేరుకున్నారు. లియాకత్ తో పాటు హోటల్ సిబ్బందిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇంతలోనే లియాకత్ స్పృహ తప్పి పడిపోయాడు.
దీంతో పోలీసులు వెంటనే లియాకత్ ను స్థానిక డెక్కన్ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. లియాకత్ మృతి చెందాడు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని లియాకత్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం లియాకత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి స్నేహితులకు సమాచారం అందించారు.
హుటాహుటిన రంగంలోకి దిగిన అతడి స్నేహితులు.. డెక్కన్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. దాడి జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతోనే లియకత్ మృతి చెందాడని ఆరోపించారు. పోలీసులతోపాటు హోటల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీకి మీర్జా రెహమత్ బేగ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చి ఘటన తాలూకు వివరాలు తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. అయితే లియాకత్ పై దాడికి పాల్పిడన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Hyderabad News: చికెన్ పకోడిలో కారం ఎక్కువైందని చెప్పినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకుడి దాడి
మూడు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే..
చికెన్ పకోడీలో కారం ఎక్కువైంది అని చెప్పినందుకు వినియోగదారుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో హోటల్ నిర్వాహకుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కే.పీ.హెచ్.బీ కాలనీలో నివసించే నాగార్జున గత రాత్రి 9వ ఫేజులోని జే.ఎస్ చికెన్ పకోడీ సెంటర్ కు వెళ్లాడు. తనకు నచ్చిన ఆర్డర్ ఇచ్చాడు. రాగానే ఆవురావురుమంటూ తినాలనుకున్నాడు. ఓ ముక్క తీసి నోట్లో పెట్టుకోగానే కారం నషాలానికి అంటింది. దీంతో వెంటనే నాగార్జున.. చికెన్ పకోడీలో కారం ఎక్కువ అయిందని హోటల్ నిర్వాహకుడికి చెప్పాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హోటల్ నిర్వాహకుడు జీవన్.. తింటే తిను లేదంటే వెళ్లిపో అంటూ దూషించాడు. కారం ఎక్కువైంది అన్నందుకే ఇలా మాట్లాడతావా అంటూ నాగార్జున వాదనకు దిగాడు. దీంతో జీవన్.. కత్తితో దాడికి దిగాడు. ఈక్రమంలోనే నాగార్జునను తీసుకెళ్లేందుకు వచ్చిన ఆయన స్నేహితుడు ప్రణీత్ వారిని ఆపేందుకు వెళ్లాడు. దురదృష్టవశాత్తు ప్రణీత్ చేయి తెగింది. తీవ్ర గాయం అయింది. విషయం గుర్తించిన స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రణీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.