స్నేహితురాళ్ల మధ్య ఫొటో చిచ్చు- క్లాస్‌లో ఫ్రెండ్ కొట్టిందని విద్యార్థిని ఆత్మహత్య
స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటో స్నేహితుల మధ్య వివాదం రాజేసింది. అంతే కాదు ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైంది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఉద్రిక్తతకు దారి తీసింది. సరదాగా తీసిన ఓ ఫోటో ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు రేపింది. క్లాస్‌లో అందరి ముందు చెంపపై కొట్టడాన్ని తట్టు కోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనంగా మారింది.
తిమ్మాజిపేట మండలం హనుమాన్ తండాకు చెందిన మూనావత్ మైన(18) బీజెడ్‌సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెతోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా అదే కాలేజీలో చదువుతున్నారు. రెండు రోజుల క్రితం కళాశాలలో తోటి స్నేహితురాలు ఓ విద్యార్థితో మాట్లాడుతుండగా మునావత్ మైన ఫోటో తీసింది. దాన్ని తన ఫ్రెండ్‌కు పంపించింది. ఆ ఫొటో చూసిన మైన స్నేహితురాలి భర్త సీరియస్ అయ్యారట. ఇదే వారి మధ్య చిచ్చు రేపింది.
కాలేజీలో తిరిగే ఫొటోలు బయట వ్యక్తులకు ఎందుకు పంపించావ్... ఇంట్లో వాళ్లు చూశారని ప్రశ్నించింది. అంతేకాదు.. క్లాస్ రూంలోనే అందరూ చూస్తుండగా మైన చెప్పపై కొట్టింది. ఇది అదే క్లాస్‌రూంలో ఉన్న మరో విద్యార్థి వీడియో తీశారు. అది కాస్త వైరల్‌గా మారి వివాదం ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లింది.
విషయంపై ఆరా తీసిన ప్రిన్సిపాల్ చిన్నమ్మ ముగ్గురిని పిలిచి క్లాస్ తీసుకున్నారు. ముగ్గురుకీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. స్నేహితురాలు చెంపపై కొట్టడం, ప్రిన్సిపాల్ వద్దకు పంచాయితీ వెళ్లడంతో మునావత్ మైన చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. నిన్న తన స్వగ్రామమైన హనుమాన్ తండాలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి చేరుకుంది.
మైనను మహబూబ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ బిడ్డ చావుకు కారణం మరో ఇద్దరు స్నేహితురాళ్ళు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అంటూ నిరసన తెలిపారు. కళాశాల ముందు విద్యార్థిని బంధువులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బంధువులు కళాశాలలోకి చొచ్చు కొని వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.
విషయంలో కలుగుచేసుకున్న పోలీసులు మైన బంధువులను వారించారు. దీంతో ఒక్కసారిగా కళాశాల ఆవరణలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ వ్యవహారం జరుగుతుండగానే కళాశాల ప్రిన్సిపాల్ చిన్నమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మైన బంధువులు అడ్డుకున్నారు. దీంతో తిరిగి కళాశాలలోనే ఆమెకు ప్రత్యేకంగా వైద్యులతో చికిత్సను అందించారు.
మృతి మైన తల్లిదండ్రులు మల్లేష్, మణెమ్మ తిమ్మాజీపేట మండల కేంద్రంలోని హోటల్ ను నడుపుకుంటూ జీవనం సాగిస్తూ తన కూతురును చదివించుకుంటున్నారు. ఆమెకు ఇలా జరుగుతుందని అనుకోలేదని వారు వాపోతున్నారు. చదువులో కూడా ముందుండే తన కూతురిని చూసి ఓర్చుకోలేకనే తోటి స్నేహితురాలు, లెక్చరర్ కూడా తన కూతురి మృతికి కారణమని ఆమె ఆరోపించారు.
స్నేహితురాల మధ్య నెలకొన్న వివాదం పై కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పడం జరిగిందని అంతలోనే విద్యార్థిని మైన ఇలాంటి ఘటనకు పాల్పడిందని కళాశాల ప్రిన్సిపల్ చిన్నమ్మ తెలిపారు. విద్యార్థిని చిన్నపాటి గొడవతో మనస్థాపన చెంది ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతో కారకులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.