Anantapur Crime News: ఒక్క రాంగ్ కాల్‌తో లైఫ్ క్లోజ్ - నా భర్తను వదిలివస్తా, నువ్వు నీ భార్యను విడిచిపెట్టు! ఊహించని విషాదం
Andhra Pradesh News | రాంగ్ కాల్ వారిని కలిపింది. కానీ అప్పటికే వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. తమ పరిచయాన్ని వివాహేతర సంబంధంగా చేసుకోగా, చివరికి మహిళా టీచర్ దారుణహత్యకు గురైన ఘటన అనంతపురంలో జరిగింది.
అనంతపురం: ఒకే ఒక రాంగ్ కాల్ తో జీవితం ముగిసింది. ప్రైవేట్ ఉపాధ్యాయురాలుని దారుణ హత్య చేసిన వ్యక్తికి అనంతపురం జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
హరిజన రుద్రేష్ అను వ్యక్తి M.A.(English) చదివాడు. అతని భార్య పార్వతి కూడా B.Ed. చదివింది. ఇద్దరూ కళ్యాణదుర్గంలో ట్యూషన్స్ తో వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు రుద్రేష్ ఫోనుకు రాంగ్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది విజయలక్ష్మి, ఆమెకూ వివాహమైనది. భర్త ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె T.T.C. చదువుతోంది. వారికి ఒకటిన్నర సంవత్సరం గల బాలుడు ఉన్నాడు. ఆ బంధాలన్నీ మరిచి, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన హరిజన రుద్రేష్ తో మాట కలిపింది. ఆ తర్వాత వాట్సాప్ లో సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుకోవడం, అలా వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
నా భర్తను వదిలివస్తా, నువ్వు నీ భార్యను విడిచిపెట్టు..
ఆ తర్వాత విజయలక్ష్మి నేను భర్తను వదిలి వస్తా, నీవు నీ భార్యను వదిలి రా.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ డిమాండ్ చేసింది. అశ్లీల ఫోటోలను, సందేశాలను అర్ధరాత్రి సమయాల్లో పంపుతోంది. వాటిని రుద్రేష్ భార్య చూడడంటో వారి కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. చివరకు రుద్రేష్ తో అతని భార్య విడిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు విజయలక్ష్మి నువ్వు నీ భార్యని వదిలి రాకపోతే.. వాట్సప్ మెసేజ్ లు, ఫోటోలు పోలీసులకు ఇచ్చి నీపైన కేసు పెడతాను అని బెదిరించేది. దాంతో రుద్రేష్ మానసిక సంఘర్షణకు లోనై ఎలాగైనా విజయలక్ష్మిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సెప్టెంబర్ 4వ తేదీ 2018 వ సంవత్సరం విజయలక్ష్మి, రుద్రేష్ కు ఫోన్ చేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను ఇంటి నుండి బయటకు వస్తున్నానని, రుద్రేష్ ను కూడా అనంతపురం కు రమ్మని చెప్పింది. రుద్రేష్ ఇదే అదనుగా భావించి ఆమె చెప్పినట్టుగా ఉదయం 10 గంటలకు అనంతపురం చేరుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రుద్రేష్ స్కూటీ లో బయలుదేరి, ఉదిరిపికొండ- శివరాంపేట గ్రామాల మధ్యలో ఒక గుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. అయితే విజయలక్ష్మిని చంపాలని పథకం వేసుకున్న రుద్రేష్ ఆమె గొంతుకు చున్నీ గట్టిగా బిగించి, ఊపిరి ఆడకుండా చేశాడు. ఒక బండ రాయి తలపై వేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై వున్న నగలను తీసుకొని పారిపోయి, అదేరోజు కళ్యాణదుర్గం ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టుపెట్టాడు. లక్ష రూపాయలు లోన్ తీసుకొని, అదే రోజు తన భార్య పార్వతికి బంగారు షాపులో నల్లపూసల దండకు రూ. 30,000 అడ్వాన్స్ కట్టి ఆర్డర్ ఇచ్చాడు. మరుసటి రోజు ఎల్ఈడి టీవీ కూడా కొన్నాడు.
Also Read: Crime News: మద్యం సీసా చెప్పిన సాక్ష్యం - 20 నెలల అనంతరం నిందితుడిని పట్టించింది, అసలు కథ ఏంటంటే?
తన భార్య స్కూలులో ఫంక్షన్ ఉందని చెప్పి పోయి, తిరిగి రాలేదని విజయలక్ష్మి భర్త అదే రోజు అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత ఉదిరిపికొండ-శివరాంపేట గ్రామాల మధ్యలో ఒక గుట్ట దగ్గర విజయలక్ష్మి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలింది. విజయలక్ష్మి సెల్ ఫోన్ లో వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు హరిజన రుద్రేష్ ను నిందితుడిగా గుర్తించి అతనిపై కూడేరు పోలీసులు Cr.No.93/2018 గా IPC సెక్షన్ 302, 404 కింద కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ప్రసాదరావు దర్యాప్తు చేసి చార్జీషీట్ దాఖలు చేశారు. 15 మంది సాక్షులను విచారించగా హరిజన రుద్రేష్ పై నేరం రుజువు కావడంతో అతడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.