Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది !
Boy Dies After Eating Jamun Fruit: తమకు నచ్చిన పండ్లు తిని మృత్యువాత పడిన ఘటనలు తరచుగా వింటుంటాం. తాజాగా అలాంటి విషాదం ఏపీలోని కర్నూలు జిల్లా కోసిగిలో జరిగింది.
![Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది ! Kurnool Boy Dies After Eating Jamun Fruits in Kurnool District Shocking News: నేరేడుపండ్లు తిని బాలుడు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం - అసలేం జరిగింది !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/2d5e983cdc01fa8234a9288b2f0b2ad8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జీవితం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉన్నవారు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోతున్నారు. వయసు మీద పడిన వారితో పాటు యువతలోనూ గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి. తమకు నచ్చిన పండ్లు తిని మృత్యువాత పడిన ఘటనలు తరచుగా వింటుంటాం. తాజాగా అలాంటి విషాదం ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.
పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లి నేరేడుపండ్లు వెంట తీసుకొచ్చింది. ఇంటి వద్ద ఉన్న ఆమె పిల్లలతో పాటు పక్కింటి చిన్నారులు ఆ నేరేడు పండ్లు తిన్నారు. ఆమెతో పాటు పండ్లు తిన్న కొంత సమయానికే పిల్లలు స్పృహ కోల్పోయారు. మహిళ సైతం అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తరలించగా.. పరీక్షీంచిన వైద్యుడు ఓ బాలుడు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో కర్నూలు జిల్లా కోసిగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా కోసిగిలో మహాదేవి అనే మహిళ పొలానికి వెళ్లింది. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తూ కొన్ని నేరేడు పండ్లను కవర్‌లో వెంట తీసుకొచ్చింది. తాను తినడంతో పాటు తన కుమారుడు హర్షకు, తన ఇద్దరు పిల్లలతోపాటు ఆడుకుంటున్న పక్కింటి బాలుడు శ్రీరాములకు నేరేడు పండ్లు ఇచ్చింది. తిన్న కాసేపటికే మహాదేవితోపాటు చిన్నారులు సృహ కోల్పోయారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. మహాదేవి కుమారుడు హర్ష అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. మిగతా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మహాదేవితో పాటు చిన్నారులను మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
మాహాదేవి అత్త నరసమ్మ నేరేడు పండ్లను రసాయన ఎరువులు ఉన్న కవర్‌లో వేసింది. ఈ విషయం తెలియని మహిళ ఇంటికి తెచ్చాక.. తాను తినడంతో పిల్లలకు పండ్లను ఇచ్చింది. క్రిమి సంహారక మందులు అంటుకున్న పండ్లను తినడంతోనే చిన్నారి చనిపోయాడని డాక్టర్ తెలిపారు. చిన్నారులకు ఏమైనా ఆహార పదార్థాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. క్రిమి సహారక మందులు అంటుకున్న పదార్ధాలు తింటే పెద్దవారు సైతం సృహ కోల్పోతారని, అలాంటిది చిన్నారుల పరిస్థితి ఎంత విషమంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు తొందరపాటుగా నీళ్లు అనుకుని యాసిడ్ తాగి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. కనుక ఏవైనా పండ్లు తినే ముందుగా వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి తినాలని సూచిస్తున్నారు.
Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)