AP Crime News: బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం, నాలుగు రోజులపాటు నరకం చూపిన ఏడుగురు యువకులు
Andhra Pradesh Crime News | కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికపై మైనర్ బాలుడు సహా ఏడుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Krishan District Crime News | గన్నవరం: కృష్ణా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా దారుణం జరిగింది. ఒంటరిగా కనిపించిన బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెను నిర్బంధించి నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
గన్నవరం మండలం వీరపనేని గూడెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని జి కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక మార్చి 9వ తేదీన పొరుగింటి మహిళతో కలిసి కృష్ణా జిల్లా వీరపనేని గూడేనికి వెళ్లింది. ఈ క్రమంలో మార్చి 13వ తేదీన చిన్న గొడవ జరగడంతో బాలిక మనస్తాపానికి గురైంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక ఒంటరిగా ఉన్నట్లు గమనించిన 15 ఏళ్ల బాలుడు, రజాక్ అనే యువకుడు కలిసి ఆమెకు మాయమాటలు చెప్పారు. ఆమెను సొంతూరు జి కొండూరులో దింపుతామని నమ్మించి బైక్ పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
అక్కడితో వదిలేయని నిందితులు ఆ బాలికను జితేంద్ర, అనిల్ అనే మరో ఇద్దరి వద్దకు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు నిందితులు సైతం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం కేసరపల్లి గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అనిత్ తో పాటు మరో యువకుడు సైతం బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా నాలుగు రోజులపాటు బాలికకు మైనర్ బాలుడు, ఆరుగురు యువకులు నరకం చూపించారు. తనను వదిలిపెట్టాలని ఆమె ఎంత వేడుకున్నా నిందితులు కనికరించగలేదు. నాలుగు రోజులపాటు పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన అనంతరం సోమవారం బాలికను ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలేసి వెళ్లారు.
ఆటో డ్రైవర్ అనుమానం వచ్చి బాలికను సంప్రదించాడు. ఆమె పరిస్థితిని గమనించి వివరాలు కనుక్కొని, మాచవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు. బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆమె మాట్లాడే స్థితిలో లేదు. పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.






















