Road Accident : లారీని ఢీకొన్న పెళ్లి బృందం కారు, వధూవరులతో సహా ఆరుగురికి గాయాలు
Road Accident : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది గాయపడ్డారు.
Road Accident : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పెళ్లి బృందం కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు, వరుడితో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రత్తిపాడు హాస్పిటల్ కు తరలించారు. పెద్దాపురం మండలం చిన్న తిరుపతిలో శనివారం తెల్లారి జామున పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు విశాఖపట్నం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు విశాఖపట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. వరుడు బండ రాజశేఖర్, వధువు ప్రశాంతి అని గుర్తించారు.
నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. పంగర బొర్గం నుంచి 8 మంది శబరిమాత భక్తులు లాక్కోర గ్రామానికి భజన కోసం వెళుతుండగా జక్రాన్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అనుమానాస్పదరీతిలో లైన్ మెన్ మృతి
జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కి చెందిన వంశీ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వంశీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం ఉదయం మోతే- నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులోని మామిడి తోటలో వ్యవసాయ బావిలో వంశీ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సాయంతో కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు దండేపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వాడని భార్య నీరజ(28), ఇద్దరు కూతుళ్లు హరిణి(8) హాసిని (4) ఉన్నారని పోలీసులు తెలిపారు.
ముంబయిలో అగ్నిప్రమాదం
ముంబయిలోని ఘట్కోపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పరేఖ్ ఆసుపత్రి సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 8 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా...వారిని పరేఖ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జునోస్ పిజ్జా రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు తీవ్ర గాయాల పాలుకాగా...వారిని రాజావాది హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతుండగానే మృతి చెందారు. ఆరు అంతస్తుల బిల్డింగ్‌లోని విద్యుత్ మీటర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అంతకు ముందు సెంట్రల్ ముంబయిలోనూ 61అంతస్తుల బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 22వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు వ్యాప్తి చెందగా...10 మంది సిబ్బంది వచ్చి మంటలార్పారు. గతేడాది కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. 19వ అంతస్తులో ప్రమాదం జరగ్గా...ఓ సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు