Kakinada Crime : కట్టుకున్న భార్యే కడతేర్చింది, క్లోరోఫామ్ ఇచ్చి హత్య, సహాజ మరణంగా డ్రామా!
Kakinada Crime : కాకినాడలో సంచలనమైన పోక్సో స్పెషల్ కోర్టు ఏపీపీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే భర్తను హత్య చేసి సహజ మరణంగా క్రియేట్ చేసిందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు కూడా ఈ కేసు వివరాలు అసంపూర్తిగానే తెలిపారు.
Kakinada Crime : మానవ సంబంధాలు రోజురోజుకీ మంట కలిసిపోతున్నాయి. కట్టుకున్న భార్యే భర్త పాలిట యమపాసంగా మారింది. తన జీవిత భాగస్వామిని విగత జీవిగా మార్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. కాకినాడలో సంచలనం రేకెత్తించిన పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజాం మృతిని హత్య కేసుగా తేల్చారు పోలీసులు. హత్యకు సూత్రధారి ఆజాం భార్యేనని చెబుతూనే అస్పష్టంగా వివరాలు వెల్లడించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆజం తండ్రి తన కుమారుడిది సహజ మరణం కాదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఈ కేసు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సహజ మరణం నుంచి అనుమానాస్పద మృతిగా.. ఆపై హత్య కేసుగా నిర్ధారించారు పోలీసులు. అయితే పోలీసుల ప్రెస్ మీట్ లో పలు సంచలనాలు బయటపెడతారని సర్వత్ర ఆసక్తి నెలకొనగా పోలీసులు మాత్రం కేసు పట్ల అత్యంత సాదాసీదాగా పై పైనే వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకుండా భార్య పాత్ర గురించి మాత్రమే ప్రస్తావించి అసలు ఈ ఉదంతం ఎలా జరిగిందో తేల్చకుండానే ముగించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
భార్యే నిందితురాలు
అక్బర్ ఆజాం కాకినాడలో మంచి పేరున్న న్యాయవాది కాగా కొంత కాలంగా పోక్సో స్పెషల్ కోర్టు ఏపీపీగా పనిచేస్తున్నారు. ఆజాం హత్య కేసుకు సంబంధించి కట్టుకున్న భార్య, తన ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను కడతీర్చేన విషయాన్ని మృతుని భార్య అహ్మద్ ఉన్నీసా నేరాన్ని అంగీకరించిందని పోలీసులు అస్పష్టంగా పేర్కొని పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. నిందితురాలు మహమ్మద్ అహ్మద్ ఉన్నిసాని రిమాండ్ కు తరలించామని, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మృతుని కుటుంబం చెప్పిన వివరాలు ఒక విధంగాను, పోలీసులు వెల్లడించిన సమాచారం మరో విధంగా ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది.
క్లోరోఫామ్ తో హత్య
అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడిస్తూ ఆజాం భార్య ఉన్నిసాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని, మిగిలిన ఇద్దరు నిందితులు కోసూరి కిరణ్ కుమార్, రాజేష్ జైన్ లను విచారిస్తున్నామని తెలిపారు. అసలు హత్యోదంతంలో ఎవరు ఏ విధంగా హత్యకు పాల్పడింది, సహకరించింది, కట్టుకున్న భర్తను ఎందుకు కడతేర్చాల్సి వచ్చింది అన్న విషయంపై మాత్రం పోలీసుల నుంచి పూర్తి వివరాలు లభించలేదు. విచారణలో తేల్చాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆజాం హత్య పథకం ప్రకారం జరిగిందని, మృతునికి క్లోరోఫామ్ ఇచ్చి తద్వారా చనిపోయేలా చేశారన్నారు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని, క్లోరోఫామ్ సీసా , ఇందుకు ఉపయోగించిన నమాజ్ టోపీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఫోన్ సంభాషణలతో
జూన్ 23న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజాం మృతి చెందినట్లుగా అతని భార్య మహమ్మద్ ఉన్నిసా బేగం తెలపడంతో సహజమరణంగా భావించి ఖననం చేశారని, ఆ తర్వాత ఒక ఫోన్లో రికార్డు చేసిన సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ ల ద్వారా హత్య జరిగిందనే అనుమానంతో అక్బర్ ఆజాం తండ్రి హుస్సేన్ ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, విచారణలో కట్టుకున్న భార్య , ఆమె ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసినట్లుగా మృతుని భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ధృవీకరించినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు అక్బర్ ఆజాం సోదరుడు కరీం స్పందిస్తూ తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి దోషులను పట్టుకోవడంతో తన అన్న ఆత్మ శాంతిస్తుందని అన్నారు.
Also Read : AP News : కూతురు కనిపించట్లేదని పీఎస్ కు వెళ్తే, చావమని సలహా ఇచ్చి మహిళా ఎస్సై!