PVNR ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం, 3 కార్లు ధ్వంసం.. ట్రాఫిక్ జామ్
PVNR Expressway | మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లేందుకు నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద మూడు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దాంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.

Hyderabad Road Accident | హైదరాబాద్: నగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే(PVNR Express way)పై పిల్లర్ నెంబర్ 47 వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వేగంగా వెళ్తున్న మూడు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వాహనాల్లో ఉన్న వారికి గాయాలు కావడంతో, వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు సకాలంలో చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను రోడ్డు మధ్యలో నుండి పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ప్రమాదకరంగా జర్నీ చేస్తూ రీల్స్..
హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌లో ఓ యువకుడు కారు బానెట్‌పై కూర్చుని ప్రయాణిస్తూ రీల్స్ చేశాడు. ఓమర్ హోటల్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో కారును వేగంగా నడుపుతూ, చేసిన ఈ స్టంట్లు ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేశాయి. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కారు నెంబర్ (TS11UA5173) ఇప్పటికే ₹3,000 కంటే ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






















