Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి కార్యాలయం నుంచి తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట కొందరు గుర్తుతెలియని దుండగులు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి కార్యాలయం నుంచి తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ పోలీసులు సోదా చేశారు. ఆఫీసులోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర డివైజ్ లు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వచ్చిన సమయంలో సిబ్బందిని బయటకు పంపించివేసినట్లు సమాచారం. ఎవరినీ క్యూ న్యూస్ ఆఫీసులోకి అనుమతించడం లేదు. మరోవైపు మల్లన్న అరెస్ట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చింది మఫ్తీలో ఉన్న పోలీసులు కాదని, గుర్తు తెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నను, సుదర్శన్ ను కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు నిజంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన వారిని ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు.
అరెస్టును తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం అన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని అనుకుంటున్నారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ? అని ప్రశ్నించారు. ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత వహించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా ? కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదాం అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 21, 2023
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని… https://t.co/VHbykgyEzM
క్యూ న్యూస్ ఆఫీస్ పై మంత్రి అనుచరులు దాడి!
హైదారాబాద్ లోని తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్ పై మార్చి 19న దుండగులు దాడి చేశారు. సుమారు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యూ న్యూస్ ఆఫీస్ లో చొరబడి కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్జాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీస్ లోకి దూసుకొచ్చిన అగంతకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యూ న్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమ కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న టీమ్ ఆరోపిస్తుంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యూ న్యూస్ టీమ్ డిమాండ్ చేస్తోంది.
మల్లారెడ్డి అనుచరులేనని ఆరోపణ
ఈ దాడిలో ఆఫీస్ ఫర్నీచర్, అద్దాలు, కంప్యూటర్లు, కూర్చీలు, టీవీలతో పాటు ఇతర వస్తువులు, సామాగ్రి ధ్వంసం అయ్యాయని క్యూన్యూస్ సిబ్బంది చెప్పారు. ఇదంతా మంత్రి మల్లారెడ్డి అనుచరుల పనని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని దాదాపు 25 మంది దుండగులు క్యూ న్యూస్ ఆఫీస్ కు వచ్చి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని సిబ్బంది ఆరోపించారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న తమపై ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆఫీస్ సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరనస తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ కు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.