Hyderabad Car Scam: విదేశీ కార్ల స్కామ్…దొడ్డిదారిలో దూసుకెళ్లి అడ్డంగా బుక్కైన హైదరాబాదీ ప్రముఖులు
రాచమార్గమున ముందుకెళ్లడం నథింగ్ స్పెషల్ దొడ్డి దారిలో దూసుకెళ్లడం సమ్ థింగ్ స్పెషల్. హైదరాబాదీ ప్రముఖులు కొందరు ఈ మాటని బాగా వంటపట్టించుకున్నారు. అందుకే దొడ్డిదారిలో వెళ్లి అడ్డంగా బుక్కయ్యారు.
సెలబ్రెటీ అంటే ఓ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా. ఖరీదైన బంగళాలు, పడవల్లాంటి కార్లు, ధగధగలాడే ఆభరణాలు, ఇంకా ఎన్నో హంగులు, ఆర్భాటాలు. ఒకర్ని చూసి ఒకరు…వీళ్లని చూసి మరికొందరు. అందుకే అతి ఖరీదైన కార్లు కొన్నారు. ఆ కార్లతో రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయి…. స్టేటస్ చూపిద్దాం అనుకుంటే..ఇప్పుడు ఆ కార్లే గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్. అసలేం జరిగింది?
కార్లు కొంటే రైళ్లు పరిగెత్తడమేంటి? వాళ్ల దగ్గర డబ్బుంది కొన్నారు అంటారా….నిజమే…కొన్నారు. కానీ రాచమార్గంలో కాదు దొడ్డిదారిలో. అవును… టాక్స్ ఎగ్గొట్టేందుకు కొందరు చూపించిన అక్రమ మార్గంలో కార్లు కొన్న సెలబ్రెటీలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు.
విదేశీ రాయబారుల పేరుతో బుకింగ్స్.. లగ్జీరీ కార్ల దిగుమతిలో అడ్డదారులు.. ముంబయి టూ హైదరాబాద్ ఖరీదైన కార్ల దందా….ఈ స్కామ్ పై అనుమానం వచ్చిన అధికారులు ముంబయిలో తీగలాగితే హైదరాబాద్‌లో లింకులు బయటపడ్డాయి. ఈ ముఠా ఇప్పటి వరకూ 50కిపైగా లగ్జరీ కార్లను ప్రముఖులకు, రాజకీయ నేతలకు అమ్మినట్లు సమాచారం. ఆపరేషన్ మాంటే కార్లో లో ఇంకా నమ్మలేని నిజాలెన్నో వెలుగుచూశాయ్.
రాయబారుల పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల స్కామ్‌పై ముంబయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆపరేషన్ మాంటే కార్లో హైదరాబాద్‌లోని ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డాయి. ముంబయి అధికార్ల సమాచారంతో హైదరాబాద్‌లోని డీఆర్ఐ అధికారులు జూన్ 19న మలక్‌పేట ప్రాంతంలో ఖరీదైన నిస్సాన్ పెట్రోల్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ముంబయి ముఠా నుంచి పలువురు కార్లు కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత కొంత కాలంగా ముంబయి పోర్టుకు 50 వరకు కార్లు దిగుమతి అయ్యాయని వాటిలో చాలా కార్లు హైదరాబాద్‌లో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల ధర కనీసం కోటిపైనే ఉంటుంది. వాటిని ఎక్కువగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కారు విలువపై 204 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. దేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇది ఆసరాగా చేసుకుని గుర్ గావ్ లో ఓ విలాసవంతమైన కార్ల విక్రయాల సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న లియాకత్ బచావ్ ఖాన్ తో పాటూ నిపుణ్ మిగ్లానీ, సురియా అర్జునన్ లు కుంభకోణానికి తెరతీశారు. వీరు రాయబారుల పేర్లతో కార్లు దిగుమతి చేసినట్టు ముంబై ఈఆర్ ఐ అధికారులు గుర్తించి నిఘా పెట్టారు. ఢిల్లీలో ఉంటున్న ఆఫ్రికాకు చెందిన ఓ రాయబారి పేరుమద కారు వస్తోందన్న సమాచారం మేరకు ముంబై పోర్టులో కాపుకాశారు. దిగుమతి అయిన కారును అంధేరీలో ఉన్న కార్ల షోరూంకి తరలించి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు. ఈ కార్లకు మణిపూర్‌లో ఓ మారుమూల షోరూంలో రిజిస్ట్రేషన్ చేయించి.. రాయబారుల పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టేందుకు ముఠా ప్లాన్ చేసింది. గతేడాది ఇరవైకి పైగా కార్లను దిగుమతి చేసింది. ముంబయి ముఠా నుంచి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారు.
రాయబారుల పేరుమీద కార్లు తెప్పించాలంటే సంబంధిత రాయబార కార్యాలయం నుంచి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ముఠా నకిలీ పత్రాలు సృష్టించిందని…. యూఏఈలో ఉండే అబ్దుల్ రహ్మాన్ అనే భారతీయుడు ఈ వ్యవహారాలను పర్యవేక్షించేవాడని అధికారుల దర్యాప్తులో వెల్లడయ్యింది
2008లో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రాగా అప్పట్లో 36 ఖరీదైన కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, నిందితులు పరారీలో ఉన్నారు. తాజా వ్యవహారంలో కూడా మళ్లీ వారి పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు అబ్దుల్ రహ్మాన్‌కు గత కేసుతో సంబంధం ఉందని ఇప్పటికే అధికారులకు క్లారిటీ వచ్చింది.
‘ఆపరేషన్ మాంటె కార్లో అనే పేరుతో జరుగుతున్న ఈ దర్యాప్తులో ఎంతమంది సెలబ్రెటీలు బయటపడతారో చూడాలి…..