Hyderabad Crime : పెళ్లి సమస్య, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి
Hyderabad Crime : నిజాంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad Crime : హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేటలోని వినాయక్ నగర్ లో జువెల్ గ్రాండ్ అపార్ట్ మెంట్ లో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 18 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. బాలుడు, బాలుని అమ్మమ్మ లలిత(56) మృతి చెందారు. బాలుని తల్లి దివ్య(36) పరిస్థితి విషమంగా ఉంది. లలిత కొడుకు శ్రీకర్ కు వివాహం జరగడం లేదని కుటుంబం డిప్రెషన్ వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్యనే లలిత ఇంటికి తన కూతురు దివ్య 18 నెలల బాబు శివ కార్తికేయను తీసుకుని వచ్చింది. లలిత భర్త 12 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. లలిత కొడుకు శ్రీకర్ కు వివాహం అవ్వడం లేదని తరచూ వీరందరూ బాధపడేవారని సమాచారం. రాత్రి 2 గంటల సమయంలో ఒక గదిలో బాలుడు శివ కార్తికేయకు చున్నితో ఉరి వేసి అనంతరం అమ్మమ్మ లలిత ఉరి వేసుకుంది. చివరకు కూతురు దివ్య ఉరి వేసుకోగా చున్ని తెగికిందపడిపోయింది. ఈ విషయం గమనించిన శ్రీకర్ బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల మృతికి డిప్రెషన్ నే కారణంగా భావిస్తున్నారు.
"శ్రీకర్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఇక్కడకు వచ్చాం. శ్రీకర్ తల్లి, సోదరి, మేనల్లుడు ఆత్మహత్యాయత్నం చేశారు. దివ్యను ఆసుపత్రికి తరలించారు. లలిత, చిన్నారి మరణించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశాం. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయి." బాచుపల్లి సీఐ.
రాజన్న సిరిసిల్లి జిల్లాలో విషాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బోయినపల్లికి చెందిన అనూష అదే గ్రామానికి చెందిన మహేందర్‌తో ప్రేమ వివాహం అయింది. వారిద్దరికీ కుమారులు గణ(3), మణి(18 నెలలు) ఉన్నారు. మహేందర్ ఉపాధి కోసం 8 నెలల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి అనూష తన అత్తామామలతో కలిసి బోయినపల్లిలోనే ఉంటోంది. ఈ క్రమంలో తరకూ గొడవలు జరిగేవి. బుధవారం రాత్రి అనూష కుటుంబ సభ్యులకు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తపానికి గురైన ఆమె తన పిల్లలను తీసుకెళ్లి వ్యవసాయ బావిలో దూకింది. తను లేకుండా కుమారులు ఎలా బతుకుతారని భావించి పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం స్థానిక రైతులు బావిలో మృతదేహాలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.