Hyderabad Crime News : మీరపేట్ హత్య అప్ డేట్.. అందుకోసమే భార్యను పాశవికంగా హతమార్చిన భర్త
Meerpet Case : వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ వ్యక్తి తన భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Meerpet Case : హైదరాబాద్‌లోని మీర్‌పేటలో జరిగిన హత్యాకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఓ వ్యక్తి తన భార్యను అమానుషంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని నీటిలో ఉడికించి చెరువులో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేరానికి ఓ వెబ్‌సిరీస్ ప్రేరణగా మారినట్లు పోలీసులు గుర్తించారు.
హత్యకు ముందు పన్నిన పథకం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి (45) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వెంకటమాధవి (35)తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి భారత ఆర్మీలో జవానుగా పనిచేసి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీవోలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న గురుమూర్తి, భార్యకు విషయం తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. భార్యను అడ్డుగా ఉండడంతో తొలగించాలని నిర్ణయించుకున్న నిందితుడు, సంక్రాంతి సెలవులను అవకాశంగా మార్చుకున్నాడు. తన ఇద్దరు పిల్లలను సోదరి ఇంటికి పంపించి, హత్యకు పక్కా ప్రణాళిక వేసుకున్నాడు.
Also Read: తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
దారుణ హత్య, అమానుష చర్యలు
జనవరి 15న ఉదయం భార్యతో గొడవ జరగగా, ఆమె తలకు బలమైన గాయాలు తగిలేలా గోడకు కొట్టాడు. తీవ్ర గాయాలతో కిందపడిన మాధవి మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత, ఓటీటీలో చూచిన వెబ్‌సిరీస్ తరహాలో మృతదేహాన్ని టాయిలెట్ లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత మృతదేహపు ముక్కలను నీటితో నింపిన బకెట్లలో వేసి, వాటర్ హీటర్‌తో ఉడికించాడు. మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేసి, రోకలితో దంచి ముద్దగా మార్చాడు. అనంతరం అన్ని ముక్కలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేశాడు. ఈ మొత్తం ప్రక్రియలో రెండు రోజులు నిద్రలేకుండా శ్రమించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
హత్య అనంతరం బండారం బహిర్గతం
జనవరి 17న సాయంత్రం భార్య కనిపించలేదని మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, ఆమె చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా, మాధవి ఇంట్లోకి వెళ్లడం మాత్రమే కనిపించగా, తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.
నిందితుడి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో నీటి బకెట్లు, వాటర్ హీటర్, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. హత్యా భయంతో వాళ్లు ఉంటున్న అపార్ట్ మెంట్ ఖాళీ అయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేపింది. నిందితుడు నివాసమున్న జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ అపార్ట్‌మెంట్ అంతా ఖాళీ అయిపోయింది. మిగతా నివాసితులు భయంతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మాధవి హత్య వార్త ఆమె స్వగ్రామమైన రాచర్ల మండలం జేపీ చెరువులో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితుడి తల్లి కూడా ఈ ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.
మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు
ఈ అమానుష ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెబ్‌సిరీస్‌ల ప్రభావం, మహిళలపై పెరుగుతున్న హింస, కుటుంబ కలహాల నుంచి కలిగే ప్రమాదాల గురించి చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మృతురాలి ఆనవాళ్లు లభిస్తే, పిల్లల డీఎన్‌ఏతో పోల్చి మరింత స్పష్టత రాబట్టే అవకాశం ఉంది అని పోలీసులు తెలిపారు.
Also Read: తల్లిని కత్తితో పొడిచి చంపిన కుమారుడు - హైదరాబాద్‌లో ఘోరం - డబ్బుల కోసమే ?





















