Cherlapally Accident : చర్లపల్లి జైలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ
Cherlapally Accident : హైదరాబాద్ చర్లపల్లి జైలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తోన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
Cherlapally Accident : హైదరాబాద్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి జైలు సమీపంలో స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురి చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన చిన్నారులను ఈసీఐఎల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు పాఠశాల విద్యార్థినులు ఈసీఐఎల్ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
జడ్చర్లలో ఘోర రోడ్డుప్రమాదం
మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి సమీపంలో ఉపాధిహామీ కూలీలతో వెళ్తోన్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఆలూరు గ్రామానికి చెందిన యాదయ్య, లలిత అనే ఉపాధిహామీ కూలీలతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ విష్ణు మృతి చెందాడు. వీరంతా జాతీయ రహదారిపై మొక్కలు నాటేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యాదయ్య, లలిత సంఘటనా స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ విష్ణును ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ పరిశీలించారు.
విజయవాడలో రోడ్డు ప్రమాదం
విజయవాడ జిల్లాలోని గణపవరానికి చెందిన భాస్కర్ రెడ్డి నర్సమ్మ ఆరోగ్య పరీక్షల కోసం బైక్‌పై ఇంటి నుంచి బయల్దేరారు. నర్సమ్మకు మధుమేహ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఈమె విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంటోంది. నెలకు ఒకసారి అలా వెళ్లి వస్తూ ఉంటుంది. అయితే వినాయక చవితికి ముందే నర్సమ్మ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా.. పండుగ ఉందని, అది అయిపోయాక వెళ్దామని ఊరుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే భార్యాభర్తలిద్దరూ బండిపై విజయవాడలోని ఆస్పత్రికి బయల‌్దేరారు.
చక్రాల కింద పడి చనిపోయిన భార్య
మరో ఐదు నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకుంటారనే లోపు రామరప్పాడు రింగు వద్ద ప్రధాన రోడ్డు దాటుతుండగా... వారి వాహనంపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భాస్కర్ రావుకు స్వల్ప గాయాలు అయ్యాయి. బండి పైనుంచి కింద పడగానే లేచి.. భార్య ఎక్కడుంది, ఏమైందో అని చూశాడు. అయితే అప్పటికే ఆమె వాహనం చక్రాల కింద విగతజీవిగా ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతేదాహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు
Also Read : రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, చివరి మాటలు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్న భర్త!
Also Read : నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతాం, లోన్ యాప్ వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్య