(Source: ECI/ABP News/ABP Majha)
Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!
Loan App Suicide : లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తట్టుకోలేక బాచుపల్లి పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Loan App Suicide : లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైంది. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న రాజేష్(35) అనే వ్యక్తి లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. డబ్బు కడుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ కట్టమని యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. అధిక మొత్తంలో డబ్బులు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారు. రోజురోజుకీ ఆ బెదిరింపులు అధికం అవ్వడంతో రాజేష్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ భార్య విజయవాడకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతుడికి మూడు సంవత్సరాల పాప ఉంది. రాజేష్ బిగ్ బాస్కెట్ లో ఒక నెల క్రితం ఉద్యోగంలో చేరినట్టు సమాచారం.
వేధింపులు తట్టుకోలేక
రాజేష్ కు అతడి భార్య ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్ మెన్ కు ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడాల్సిందిగా కోరింది. వాచ్ మెన్ వెళ్లి చూసేసరికి రాజేష్ ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు. వాచ్ మెన్ వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లోని ఓ బోర్డుపై "నేను యాప్ లోన్ తీసుకొని డబ్బు కడుతున్నప్పటికీ నన్ను రోజూ అసభ్యపదజాలంతో బాధ పెడుతున్నారు. నేను ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని" రాజేష్ రాశాడు. ఈ యాప్ నిర్వహికులపై ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, వేరే వాళ్లు తన లాగ బలి కాకుండా రక్షించాలని రాజేష్ సూసైడ్ నోట్ లో రాశాడు.
లోన్ యాప్ మోసాలు
లోన్ యాప్ నిర్వాహకులు సరికొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ... అమాయకపు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో లోన్ తీసుకున్న వాళ్లనే టార్గెట్ చేసే దళారులు, ఇప్పుడు డబ్బున్న వాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దోచేస్తున్నారు. విపరీతంగా వేధిస్తూ.. డబ్బులు గుంజుతున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యాపారిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. అతని సన్నిహితులు, బంధువులకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేసి డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా 1700 లోన్ తీసుకున్నట్లు ఏడు రోజుల కాల పరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతకరమైన మెసేజ్ లతో రవి కుమార్ ను వేధించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా అసలు 1700 వడ్డీ 1300 అసలు కలిపి మొత్తం 3 వేలు చెల్లించాలని పోన్ చేసి వేధిస్తున్నారు. రవి కుమార్ ను చోర్, సెక్స్ వర్కర్ గా చిత్రీకరిస్తూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి వాట్సాప్ మెసేజ్, ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తను తీసుకొని డబ్బులు చెల్లించలేదంటూ చేస్తున్న ప్రచారానికి రవి కుమార్ కంగుతిన్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న టార్చర్ కు మానసిక వేదనకు గురయ్యాడు. సన్నిహితుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించాలని చెబుతున్నారు.