Hamsaladeevi Beach: హంసలదీవి బీచ్‌లో విషాదం- స్నానానికి దిగి ఒకరు మృతి, మరొకరు గల్లంతు
AP Crime News | ఆదివారం సెలవురోజు అని సరదా కోసం బీచ్ కు వెళ్తే ఒకరు చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని హంసలదీవి బీచ్‌లో జరిగింది.

Tragedy at Hamsala Deevi Beach | కోడూరు: సరదాగా బీచ్ కు వెళితే ఐదుగురు పర్యాటకులు గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు అతికష్టం మీద ముగ్గుర్ని ప్రాణాలతో కాపాడారు. ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
గుడివాడకు చెందిన కొందరు పర్యాటకులు హంసలదీవి బీచ్ కు వెళ్లారు. స్నానం చేసేందుకు బీచ్ లో దిగగా అలల ధాటికి ఐదుగురు కొట్టుకుపోయారు. రక్షించండి అంటూ వారు గట్టిగా కేకలు వేయడంతో దగ్గర్లోని మెరైన్ పోలీసులు, ఓ ఆటో డ్రైవర్ ముగ్గుర్ని రక్షించినట్లు సమాచారం. షేక్ ఫజల (26) అనే మహిళ మృతి చెందగా, ముషారఫ్ (20) గల్లంతైన వ్యక్తిగా గుర్తించారు. షేక్ ఫజలను సైతం నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు ఆమె పరిస్థితి బాగోలేదని 108 వాహనంలో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. మిగతా వారికి సైతం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. గల్లంతైన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.






















