Guntur News : గుంటూరులో బెంజ్ కారు బీభత్సం, మత్తులో ఉన్న డ్రైవర్ కు దేహశుద్ధి
Guntur News : గుంటూరులో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు రోడ్డుపై ఇతర కార్లను ఢీకొట్టాడు.
Guntur News : గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్, మహాలక్ష్మి బార్ ప్రాంతాలల్లో బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు కార్లను గుద్దుకుంటూ వెళ్లి ఫిట్ జోన్ జిమ్ వద్ద ట్రాన్స్ ఫారమ్ ను ఢీకొట్టాడు. అతడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. యువకుడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తిరుపతిలో ఇటీవల కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి కారులో వెళుతున్న వ్యక్తి బ్రేక్ తొక్క పోయి ఎక్స్ లెటర్ తొక్కడంతో రోడ్డు పక్క ఉన్న షాప్ లోకి కారు దూసుకెళ్లింది. షోరూం నుంచి కొత్త కారు తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో నాలుగు బైక్ లు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన భైరవకి పట్టెడ ప్రాంతంలో అలజడి సృష్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం గురించి ఆరా తీశారు.
మద్యం మత్తులో యువతి హల్ చల్
పెద్దపల్లి జిల్లాలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. అడ్డు వచ్చిన వారిపై బూతులు తిడుతూ రాళ్లతో దాడికి దిగింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కరీంనగర్ కు చెందిన ఓ యువతి ఆటో కిరాయికి తీసుకొని గోదావరిఖనిలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. చౌరస్తాలో ఆటో దిగిన ఆమెను డ్రైవర్ డబ్బులు అడగడంతో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేస్తూ బూతు పురాణం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి యత్నించింది. ఆమెను అడ్డుకున్న వారిపై కూడా దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి మళ్లీ గోదావరిఖని బస్టాండ్ కు వెళ్లింది. అక్కడ కూడా ఆటో డ్రైవర్లను తిడుతూ దాడికి పాల్పడింది. స్థానికులు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యువతి బ్యాగ్ ను చెక్ చేయగా అందులో మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. యువతి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కాకినాడలో కారు బీభత్సం
ఇటీవల కాకినాడలో మద్యం మత్తులో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు పలు వాహనాలు ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు గాయాలపాలైయ్యారు. అనకాపల్లికి చెందిన మేఘాద్రి రాజు స్థానికంగా ఓ వ్యక్తి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కారు యజమాని కుమార్తె కాకినాడ జగన్నాథపురంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుంది. ఓనర్ కుమార్తెను అనకాపల్లి తీసుకురమ్మని డ్రైవర్ రాజును పంపించాడు. దీంతో అతడు కారు తీసుకుని కాకినాడ వెళ్లాడు. కారు కాకినాడ మెయిన్‌రోడ్డులోని గ్లాస్‌హౌస్ కూడలివద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా కారు ఢీకొట్టింది. అనంతరం ద్విచక్రవాహనంపై వెళ్తోన్న ఇద్దరిని, తదుపరి మరో బైక్ ను వరుసగా ఢీకొట్టి చివరగా సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలికను కూడా ఢీకొట్టింది. చివరకు మరో కారును కూడా ఢీకొట్టి ఆగింది. దీంతో పలు వాహనాలు ధ్వంసం కావడంతోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి.