East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతు
East Godavari News : గోదావరిలో గల్లంతై ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఐదుగురు పిల్లలు గోదావరిలో స్నానానికి వెళ్లారు.
East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోదావరి(Godavari River)లో గల్లంతై ఇద్దరు బాలురు మృతి చెందారు. జిల్లాలోని ఆలమూరు మండలం బడుగు వానిలంకలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. చెముడు లంకకు చెందిన ఐదుగురు పిల్లలు ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి స్నానానికి వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి స్నానానికి వెళ్లిన వారందరూ 13, 14 ఏళ్ల లోపు వారే. గల్లంతైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి(Mla chirla jaggireddy) పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
హోలీ రోజున విషాద ఘటనలు
ఈ ఏడాది హోలీ వేడుకలు పెను విషాదాన్ని నింపాయి. హోలీ రోజు రంగులు చల్లుకున్నాక స్నానానికి వెళ్లి 12 మంది మృతి చెందడం (Tragedy In Holi Celebrations Telangana) విషాదకరం. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి.
మెదక్ జిల్లాకు చెందిన రామాయి సతీష్ (27) భార్య మాధవితో కలిసి హైదరాబాద్ మియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. మక్తలక్ష్మాపురం గ్రామం నుంచి పని కోసం హైదరాబాద్ వచ్చిన సతీష్.. హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడిన తరువాత స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. కానీ నీళ్లల్లో మునిగిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులానగర్‌కు చెందిన గుగులోత్ స్వామి ఇంటర్ వొకేషనల్ కోర్సు చేస్తున్నాడు. హోలీ సెలబ్రేట్ చేసుకున్నాక గొల్లపల్లి ఎత్తిపోతల సమీపంలోని నల్లవాగులో ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన రాజు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంనంపేటలో ఉంటున్నాడు. రాయ్‌చూర్‌కు చెందిన రాజుకు ఏకైక కుమారుడు నరేంద్ర. 15 ఏళ్ల యువకుడు నరేంద్ర హోలీ ఆడిన తరువాత కుంటలో స్నానానికి వెళ్లి ఈత రాక, నీట మునిగాడు. పెద్దపల్లి జిల్లా బోయినిపేట గ్రామానికి చెందిన టీనేజర్ ఎర్రవేన ముఖేష్ (14) మిత్రులతో కలిసి హోలీ ఆడాడు. రంగులు కడిగేసుకునేందుకు బొక్కలవాగుకు స్నానానికి వెళ్లాడు. కానీ గుంతలో ఇరుక్కుని చనిపోయాడు. ఈత రాకపోవడంతో విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పేర్ల రామారావు, కటలక్ష్మి దంపతుల కుమారుడు సాగర్ (19) స్నేహితులతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడు. స్నానం చేయడానికి వెళ్లిన సాగర్ చెరువులో పడి చనిపోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట జలాల్‌పూర్ వాసి గూండ్ల రాజేశ్వర్(50) హోలీ రంగులు కడిగేసుకునేందుకు చెరువులో స్నానానికి దిగారు. కానీ నీటి మునిగి అతడు చనిపోయాడు. జిల్లాలోని పెంటాకలాన్‌కు చెందిన సుధాకర్ అనే యువకుడు హోలీ ఆడిన తరువాత నిజాంసాగర్ ప్రధాన కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. కానీ కొంత సమయానికి సుధాకర్ కనిపించకపోవడంతో స్నేహితులు అధికారులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతకగా శవం లభ్యమైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉంటున్న దినేష్‌కుమార్(21) స్నేహితులతో ఆడి ఆడాక, కుమురం భీం ప్రాజెక్టు వద్దకు స్నానం చేసేందుకు వెళ్లాడు. కానీ కాలు జారి నీటిలో పడిపోయి చనిపోయాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నల్గొండలో ఒకరు, ములుగులో మరో యువకుడు..
నల్గొండ జిల్లా సీతారాంపురానికి చెందిన మేడబోయిన భాస్కర్(38) మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగి. స్నేహితులతో హోలీ ఆడిన తరువాత కాల్వ వద్దకు వెళ్లాడు. గట్టున కూర్చున్న భాస్కర్ కాల్వలో పడిపోయి, చనిపోయాడని స్నేహితులు తెలిపారు. స్నేహితులు అతడ్ని బయటకు వెలికి తీసినా బలమైన గాయాలు కావడంతో చనిపోయాడు. ములుగు జిల్లాకు చెందిన గీత కార్మికుడు కార్తీక్ హోలీ రోజు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. నాటు పడవలతో గాలించగా సాయంత్రం అతడి మృతదేహం లభ్యమైంది. హనుమకొండ జిల్లా పంథిని చెందిన తరాల అజయ్‌కుమార్ (14), కొత్తగూడెం పట్టణం రుద్రంపూర్‌లో ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి బొజ్జం అఖిల్ (14) సైతం హోలీ రోజు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఎంతో భవిష్యత్ ఉందని భావించిన కుమారులు చిన్న వయసులోనే చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానిక నేతలు చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు