Champapet Murder: చంపాపేట యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ - భర్తే హంతకుడిగా పోలీసుల నిర్ధారణ
Champapet Murder: చంపాపేటలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తే హంతకుడని, వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు.
హైదరాబాద్ నగరంలోని చంపాపేటలో శనివారం జరిగిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వప్న(20) అనే యువతిని భర్త ప్రేమ్ కుమారే హత్య చేసినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న స్వప్న ప్రియుడు కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ జరిగింది
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన మోహన్, రూప దంపతుల కుమార్తె స్వప్న (20). చాలా రోజులుగా దంపతులు విడిగా ఉంటుండగా, ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన మోహన్ ఆటో నడుపుతున్నారు. స్వప్న నెల రోజుల క్రితం ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు చంపాపేటలోని రాజిరెడ్డి నగర్ లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో శనివారం స్వప్న దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు తెగి రక్తపు మడుగులో ఉన్న సమయంలోనే ప్రేమ్ కుమార్ రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. దీన్ని గమనించిన యజమాని గదిలోకి వెళ్లి చూడగా యువతి విగతజీవిగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ప్రేమ్ కుమార్ ను ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు
యువతి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నపోలీసులు, కాల్ డేటా ఆధారంగా విచారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని సైతం నమోదు చేశారు. వివాహేతర సంబంధమే యువతి హత్యకు కారణమని గుర్తించారు.
భర్తే హంతకుడు
భర్త ప్రేమ్ కుమారే యువతిని చంపినట్లు పోలీసులు తేల్చారు. 'ఘటన జరిగిన రోజు ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చేసరికి స్వప్న ప్రియుడు సతీష్ అనే ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో సతీష్, ప్రేమ్ కుమార్ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ప్రేమ్ కుమార్ ఇంట్లోని కత్తితో స్వప్నను హతమార్చాడు. దీన్ని చూసిన యువతి ప్రియుడు అతనిపై దాడి చేసి భవనం పైనుంచి తోసేశాడు. అనంతరం పరారయ్యాడు.' అని పోలీసులు తెలిపారు. ప్రియుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
గతంలోనూ గొడవలు
మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, ఆమెకు నెల క్రితం ప్రేమ్ కుమార్ తో వివాహం జరిగింది. ఈ క్రమంలో సతీష్ తరచూ స్వప్న ఇంటికి వచ్చి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై భర్తకు, ఆమెకు మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవి. తరచూ బయటి వ్యక్తులు వచ్చి పోతుండడంతో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతలోనే స్వప్న దారుణ హత్యకు గురైంది.
Also Read: సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సీసీ అనుమానాస్పద మృతి, ఒంటిపై కాలిన గాయాలు