AP Crime: కడప జిల్లాలో దారుణం.. మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ
కడప జిల్లాలో ఆగంతకుల చోరీలు హడలెత్తిస్తున్నాయి. మహిళలే లక్ష్యంగా వీరు చోరీలకు తెగబడుతున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
కడప జిల్లాలో ఆగంతకుల చోరీలు హడలెత్తిస్తున్నాయి. మహిళలే లక్ష్యంగా వీరు చోరీలకు తెగబడుతున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచోటి పట్టణం కె.రామాపురంలోని డైట్ వసతి గృహ ఆవరణలో మహేశ్వరి (55) అనే మహిళ మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఓ ఆగంతకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తలపై రాయితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కింద పడిన మహిళ మెడలో ఉన్న గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. ఆమె నిలువరించడంతో మరోసారి రాయితో తలపై కొట్టి.. గొలుసు అపహరించాడు. ఆగంతకుడు లాక్కున్న గొలుసు బరువు 40 గ్రాములు ఉంటుందని బాధిత మహిళ చెప్పారు. ఈ ఘటనలో మహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కోడి కత్తితో దాడి..
కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎన్జీవో కాలనీలో ఓ మహిళపై దుండగుడు కోడి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామాపురంలో చోరీకి పాల్పడిన వ్యక్తే ఎన్జీవో కాలనీలో మహిళపై దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన చోరీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. అనంతపురం జిల్లాలో ఘటన
12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన.. ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రమేష్ (42) అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత బాలికను కొంత కాలంగా అనుసరిస్తున్న రమేష్.. ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు.. రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ గ్రామంలో నాటుసారా అమ్ముతూ.. జీవనం సాగిస్తుంటాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.