Groom Dies Of Electric Shock: విద్యుత్ షాక్ తో విషాదాలు - రిసెప్షన్ రోజే వరుడు మృతి! మరోచోట తండ్రీకొడుకులు!
Groom Dies Of Electric Shock : సిద్దిపేట జిల్లాలో రిసెప్షన్ కు ముందే వరుడు మృతిచెందాడు. మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకుల మృతిచెందారు.
Groom Dies Of Electric Shock :
సిద్దిపేట: అప్పటివరకూ ఆ ఇల్లు పెళ్లి సందడితో కళకళ లాడింది. పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. కానీ వారి సంతోషం ఎక్కువ గంటలు నిలవలేదు. సిద్దిపేట జిల్లాలో రిసెప్షన్ కు ముందే వరుడు మృతిచెందాడు. మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకుల మృతిచెందారు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
రిసెప్షన్ కు ముందే వరుడు మృతి..
సిద్దిపేట జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లయిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. దాంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
అసలేం జరిగిందంటే..
సిద్దిపేట గ్రామీణ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెంటాచారి, జయలక్ష్మి దంపతులు. వీరికి సంతానం నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కుమారుడు నారోజు నిరంజన్ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హై స్కూల్ లో టీచర్ గా చేస్తున్నాడు. సెప్టెంబర్ 2వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన వైష్ణవితో నిరంజన్ వివాహం జరిగింది. పెళ్లి రిసెప్షన్ ను సిద్దిపేటలో సోమవారం మధ్యాహ్నం చేయాలని నిర్ణయించారు. తెల్లవారుజామున ఇంటి టెర్రస్ మీదకు వెళ్లిన నిరంజన్ రిసెప్షన్ ఏర్పాట్లపై తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన లైట్లకు సంబంధించిన వైర్ల చుట్ట నిరంజన్ కు తగిలింది. విద్యుత్ షాక్ కొట్టడంతో వరుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం నిరంజన్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు దాబాపైకి వెళ్లి చూడగా వరుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాకయ్యారు. శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇంట్లో పెను విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: LB Nagar Murder Case: టెన్త్ క్లాస్ నుంచే వేధింపులు! మా అక్కను శివ చంపేస్తాడని భయంగా ఉంది - ఆందోళనలో సంఘవి తమ్ముడు
విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకుల మృతి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్లలో నివాసం ఉండే ఎడ్ల రాజేందర్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు అరుణ్ కుమార్ బైక్ మెకానిక్ షోరూమ్ లో పని చేస్తున్నారు. తండ్రి రాజేందర్ స్నానం చేసి టవల్ దండంపై ఆరవేస్తుండగా కూలర్ విద్యుత్ వైరు తగిలి షాక్ కు గురయ్యారు. ఇది గమనించిన కొడుకు అరుణ్ కుమార్ తండ్రిని రక్షించే ప్రయత్నంలో తాను కూడా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఈ ఘటనలో తండ్రి, కొడుకు మృతి చెందారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రికొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Also Read: Crime News: దారుణం - మేకపై అత్యాచారం చేస్తూ యువకుడు వీడియో, నిందితుడి అరెెస్ట్